రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా

– ఇష్టాగోష్టిలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గత ఎన్నికల నుంచి రాజకీయాలు చాలా కమర్షియల్‌గా మారాయని ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు. 30 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అక్టోబర్‌లోనో, నవంబర్‌లోనో రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తనను కలిసి విలేకర్లతో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తుందో, లేదో తనకు తెలియదన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎవరో పెద్ద నాయకులు షర్మిలతో మాట్లాడినట్టు అనిపిస్తున్నదని వివరించారు. బీజేపీ ఊపు తగ్గుతున్నదని చెప్పారు. బీజేపీలో ఎవరు మాట్లాడినా సీరియస్‌గా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీలో ఇన్‌ సైడర్స్‌ వర్సెస్‌ అవుట్‌ సైడర్స్‌ నడుస్తున్నదని చెప్పారు.తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ అపహాస్యం చేశారని విమర్శించారు. పార్లమెంట్‌ తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారనీ పార్లమెంట్‌లో మోడీ ఆరోపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై ఆనాడు హౌంమంత్రితో రెండు సార్లు చర్చించానని తెలిపారు. అప్పటి లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఎంతో ధైర్యంతో తెలంగాణ బిల్లును పాస్‌ చేశారని పేర్కొన్నారు. మీరాకుమార్‌ ధైర్యం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఇప్పుడు ఏలుతున్న వారు తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదన్నారు. 1200 మంది బలిదానాలు చేశారని గుర్తుచేశారు.