ఆపరేషన్‌ చేసి పొట్టలో దూది వదిలేసిన వైద్యులు

Stomach after operation Doctors who left cotton– పరిస్థితి విషమించి బాలింత మృతి
– డాక్టర్‌ నిర్లక్ష్యంపై బాధితుల ఆగ్రహం
– మృతదేహంతో అంబేద్కర్‌ విగ్రహం ముందు రాస్తారోకో
నవతెలంగాణ-అచ్చంపేట రూరల్‌
ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్‌ నిర్లక్ష్యం బాలింత ప్రాణం తీసింది. ఆపరేషన్‌ చేసిన వైద్యులు పొట్టలో దూది వదిలేయడంతో వారం రోజుల తర్వాత తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించి ఆమె మృతిచెందింది. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలో బుధవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట మండలం దర్శన్‌గడ్డ తండాకు చెందిన గిరిజన లంబాడి మహిళ రోజా గర్భం దాల్చినప్పటి నుంచి అచ్చంపేట పట్టణంలోని సర్రాం (శ్రీరామ్‌) ఆస్పత్రి డాక్టర్‌ కృష్ణ వద్ద చూపించుకునేది. ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలోనూ విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 15న రోజాకు పురిటి నొప్పులు రావడంతో డాక్టర్‌ వద్దకెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ బాలింత కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. ఆ తర్వాత రోజాను డిశ్చార్జి చేశారు. కాగా రోజాకు తీవ్ర రక్తస్రావమవ్వడంతో మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తస్రావం తగ్గకపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్‌ సూచించారు. అక్కడికెళ్తే.. పేషెంట్‌కు పూర్తిగా రక్తం లేదని, హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. దాంతో వెంటనే హైదరాబాద్‌ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి డాక్టర్లు రోజాకు స్కానింగ్‌ చేస్తే.. కడుపులో సుమారు 12 సెంటీమీటర్ల పొడవు గల ఒక వస్తువు ఉందని, అందువల్లే రక్తస్రావం అవుతోందని చెప్పారు. వెంటనే ఆపరేషన్‌ చేస్తేనే ప్రాణం దక్కుతుందని చెప్పారు. కానీ అప్పటికే పేషెంట్‌ శరీరం పూర్తిగా తెల్లబడిపోయి.. మంగళవారం రాత్రి మృతిచెందింది. కుటుంబీకులు ఆగ్రహంతో అచ్చంపేటలో శ్రీరామ్‌ ఆస్పత్రిని ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహాన్ని పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద పెట్టి ధర్నా చేశారు.