వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకి ఆపాదిస్తారా?

– నిరుద్యోగుల జీవితాలతో రాజకీయాలు తగదు
– గుజరాత్‌లో 13సార్లు పేపర్లు లీక్‌ అయ్యాయి…
– మోడీని రాజీనామా కోరే ధైర్యం ఉందా?
– బండి సంజరుకు మంత్రి కేటీఆర్‌ సవాలు
– లీకేజీ నిందితులు బీజేపీ యాక్టివ్‌ కార్యకర్తలే…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థలకు ఆపాదించి, నిరుద్యోగుల జీవితాలతో రాజకీయాలు చేయడం తగదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే తారకరామారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకు హితవు చెప్పారు. గుజరాత్‌లో 13 సార్లు పరీక్ష పేపర్లు లీక్‌ అయ్యాయనీ, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్రమోడీని రాజీనామా కోరే ధైర్యం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి ఉందా అని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజరువి అజ్ఞానపు వ్యాఖ్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి కనీస అవగాహన కూడా ఆయనకు లేదనీ, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రభుత్వ శాఖ కాదనీ, అదో రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనీ చెప్పారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. నిరుద్యోగులు ఇలాంటి నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజరు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా, దిగజారుడు వాదనలు చేస్తూ, ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భూరికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా ఇలాంటి అర్థరహితమైన ఆరోపణలే చేశారని గుర్తుచేశారు. గతంలో ఇంటర్‌ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేసి, పరువునష్టం కేసు ఎదుర్కోంటున్నారని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజరు చేస్తున్న కుట్రలకు భవిష్యత్‌లో క్రిమినల్‌ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటిదాకా వందకు పైగా సందర్భాల్లో ప్రశ్నా పత్రాల లీకేజీలు జరిగాయనీ, దీనిలో స్వయంగా బీజేపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్టు తేలిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్లు లీకైనప్పుడు మంత్రిని కానీ.. అక్కడి ముఖ్యమంత్రిని కానీ ఏనాడు ఆపార్టీ బాధ్యులను చేయలేదని గుర్తుచేశారు. ఇతర పార్టీలు ప్రాతినిథ్యం వహించే రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నిందిస్తూ మరోలా వ్యవహరించడం దిగజారుడు రాజకీయం కాక ఇంకేంటని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం సిట్‌ను నియమించి బాధ్యులైన వారందరినీ అరెస్టు చేసిందని గుర్తుచేశారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దుచేయాలనే కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం బాధాకరమైనా తప్పలేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లపై కోటి ఆశలతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటే.. వాటిని పక్కన పడేసి తనతో కలిసి రావాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్‌ కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందనీ, తన రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను పణంగా పెట్టి పేపర్‌ను లీక్‌ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదేనని స్పష్టం చేశారు.