రక్తదానం ప్రాణదానంతో సమానం

– ఆర్డీసీ డిపో మేనేజర్‌ అశోక్‌రాజు
– డిపోలో రక్తదాన శిబిరం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రక్తదానం ప్రాణదానంతో సమానమని ఇబ్రహీంపట్నం ఆర్డీసీ డిపో మేనేజర్‌ అశోక్‌రాజు అన్నారు. మంగళవారం ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం డిపోలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను రక్షించిన వారవుతారని గుర్తు చేశారు. ఒక యూనిట్‌ రక్తదానంతో ముగ్గురి ప్రాణాలని కాపాడవచ్చని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషంగా వుందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేడు ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం లభించకపోవడం వల్ల ప్రాణాలు వదులుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 37మంది ఆర్టీసీ ఉద్యోగులు, 26 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి సలహాలు, సూచనాలు చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ, జీవదార రక్తదాన శ్వచ్చంద సంస్థ భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ సరస్వతి, ఎంఎఫ్‌ సత్తయ్య, ఎస్‌వో శ్రీనివాస్‌, సూపర్‌ వైసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.