పాఠశాలల అభివృద్ధికి దాతల చేయూత

– ఇన్‌చార్జి ఎంఈఓ మనోహర్‌
నవతెలంగాణ-కేశంపేట
మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు చేయూతనందించడం ఎంతో సంతోషకరమని ఇన్‌చార్జి ఎంఈఓ మనోహర్‌ అన్నారు. మండల పరిధిలోని చౌలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సుమారు రూ.20వేల విలువచేసే ఉచిత నోట్‌ పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రిని విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్‌ నిర్వాహకులు వాసుదేవ్‌, పూర్ణచంద్రరావు గురువారం అందజేశారు. విద్యార్థులకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన మహమూద్‌ జాఫర్‌ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫలక్‌ నామ పోలీస్‌ స్టేషన్‌ హైదరాబాద్‌ వారు పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం సుమారు 20వేల రూపాయల విలువైన వాటర్‌ ఫిల్టర్‌ను అందజేశారు.ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎంఈఓ మనోహార్‌ మాట్లాడుతూ దాతలు పాఠశాలకు చేయూతను అందించడం అభినందనీయమన్నారు. ఇదే విధంగా ఇతర పాఠశాలలకు సైతం దాతలు మందుకు చేయూతనివ్వాలని తెలిపారు. చక్కగా చదువుకొని విద్యలో రాణించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. దాత ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ మహమూద్‌ జాఫర్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోసఫ్‌, ఉపాధ్యాయులు నవీన్‌, శారద, అప్పారావు, రాఘవేందర్‌, మెర్సీ మాదురి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ లక్ష్మయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.