– బీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి
– ఎంపీ నామా నాగేశ్వరరావు
– రూ.800కోట్లతో అభివృద్ధి చేసా…మరోసారి అవకాశం ఇవ్వండి : మెచ్చా
నవతెలంగాణ-దమ్మపేట
కర్ణాటక ప్రజలలాగా మోసపోకండని, బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో నామా నాగేశ్వరరావు, అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు మండల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మరోసారి పార్టీని గెలిపిస్తాయని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణలో గడ్డుకాలం వస్తుందని అన్నారు.మూడోసారి కేసీఆర్ సీఎం కాబోతున్నారని అందులో ఎలాంటి సందేహం లేదని, పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరావుకు ఓటు వేసి గెలిపిస్తే తామిద్దరం జోడెద్దులు లాగా నియోజకవర్గ అభివృద్ధికి పని చేస్తామని అన్నారు. అనంతరం మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 800 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానన్నారు. మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం ఎంపీ నామ మండలంలోని 31 గ్రామపంచాయతీల గ్రామ కమిటీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే అశ్వారావుపేట నియోజకవర్గ యువజన విభాగం సెక్రెటరీగా యార్లగడ్డ శ్రీనివాస్ రావును నియమించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల నాయకులు, ఉప సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, పాల్గొన్నారు.