ప్రపంచాన్ని రెండుగా విభజించవద్దు ఐరాస ప్రధాన కార్యదర్శి

ప్రచ్చన్న యుద్ధకాలంలో జరిగినట్టు ప్రపంచాన్ని అమెరికా, చైనా కూటములుగా చీల్చవద్దని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి, ఆంటోనియో గూటెరస్‌ జీ-7 దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈలోపు పశ్చిమ దేశాలు తమ సంయుక్త సమావేశంలో అణ్వాయుధాల గురించి రష్యా, చైనాలపై ఆరోపణలను గుప్పించాయి. వాతావరణ మార్పు, అభివ్రుద్ధి గురించి జీ-7 దేశాలకు, చైనాకు మధ్య ‘క్రియాశీలమైన చర్చలు, సహకారం’ ఉండాలని జపాన్‌ లోని హిరోషిమాలో సమావేశమైన జీ-7 దేశాలైన అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, బ్రిటన్‌ లకు ఆయన హితవు పలికారు. ‘ప్రపంచాన్ని రెండుగా విభజించాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని, చర్చలు జరపటానికి అనుగుణమైన వాతావరణాన్ని సృష్టించాలని నేను భావిస్తున్నాను’ అని ఆంటోనియో గూటెరస్‌ అన్నారు. ఈ మధ్య కాలంలో పశ్చిమ దేశాలకు, చైనాకు మధ్య ఒక ప్రచ్చన్న యుద్ధ వాతావరణం నెలకొన్నదని, అమెరికా, చైనా దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. తైవాన్‌ తో అమెరికా సంబంధాలు చైనాను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. ఒకవైపు గూటెరస్‌ ‘ప్రపంచాన్ని విభజించవద్దు’ అని హెచ్చరిస్తుండగా, మరోవైపు జీ-7 దేశాలు తమ సంయుక్త ప్రకటనలో రష్యా అయుధ నియంత్రణ ఒప్పంధాలను విస్మరిస్తూ ‘బాధ్యతారహితంగా అణ్వాయుధాలను ఉపయోగిస్తా’నని ప్రకటిస్తున్నదని, చైనా ప్రపంచ , ప్రాంతీయ భద్రతలకు ప్రమాదకరంగా అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని పేర్కొన్నాయి. ఇదిలావుండగా డిప్లీటెడ్‌ యురేనియం మందుగుండును బ్రిటన్‌ ఉక్రెయిన్‌ కు సరఫరాచేయటాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది.