మినీ డీఎస్సీ వద్దు..మెగా డీఎస్సీ కావాలి

– 13,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి
–  విద్యాశాఖ కార్యాలయం వద్ద అభ్యర్థుల ఆందోళన
– అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఐదు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటనపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు మినీ డీఎస్సీ వద్దు… మెగా డీఎస్సీ కావాలి’అంటూ డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినట్టుగా 13,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం వద్ద వందలాది మంది అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అయితే అప్పటికే పెద్దఎత్తున పోలీసులు మోహరించడంతో అభ్యర్థులను అరెస్టు చేశారు. గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ఐదు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేస్తే చాలా జిల్లాల్లో ఖాళీలుండబోవని డీఎడ్‌, బీఎడ్‌ అభ్యరు ్థలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే వారంరోజుల్లో మళ్లీ పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రవీంద్రభారతి వద్ద కొందరు అబ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం నాయకులు హరీశ్‌, శ్రీను, సాయి, లక్ష్మణ్‌, చందు, ఇర్ఫాన్‌, భాను, కోటేశ్‌, కవిత, స్వప్న, మౌనిక, శ్రీలత, మంజుల తదితరులు పాల్గొన్నారు.