– వర్షాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువును ఈనెల 28 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాల నేపథ్యంలో బుధ, గురువారం రెండురోజులపాటు అన్ని విద్యాసంస్థలకూ ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని పేర్కొన్నారు. దీంతో మొదటి, రెండు, మూడో విడతలో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన వారు కాలేజీల్లో రిపోర్టు చేసే గడువు కూడా ఈనెల 28 వరకు పొడిగించామని తెలిపారు. అదేరోజు నుంచి డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.