– రూ. 9.89 కోట్లతో నిర్మించిన 168 ఇండ్లు పూర్తి
– పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
– లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశం
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 15వ డివిజన్ అల్లీపురంలో పేదల ఆత్మగౌరవం పెంచే విధంగా ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు రూ. 9.89 కోట్లతో నూతనంగా నిర్మించిన 168 డబుల్ బెడ్ రూం ఇండ్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తో జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ కలిసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి అన్నదే సీఎం కేసిఆర్ సంకల్పమని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వమే కట్టించి, పేదలకు పంపిణీ చేస్తున్నదని అన్నారు. పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నిరుపేదలను కొత్తింట్లోకి పంపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఏదో ఓ ఇంటికి ఇంత డబ్బు, మెటీరియల్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా, ప్రభుత్వం పేదల ఆత్మగౌరవం పెంచే విధంగా ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించిందన్నారు. పూర్తి పారదర్శకంగా అర్హులైన లబ్ధదారులను ఎంపిక చేసి వారికి ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసిసిబి చైర్మెన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, తహశీల్దార్ స్వామి, డీఈ నవ్యజ్యోతి, ఆర్డీవో గణేష్, ఆర్‌అండ్‌బి ఈఈ శ్యాం ప్రసాద్, విద్యుత్ ఎస్‌ఈ సురేందర్, ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మెన్ భీరెడ్డి నగచంద్రా రెడ్డి, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నగర ప్రచార కార్యదర్శి షకీనా, కార్పొరేటర్లు రావూరి కరుణ సైదు బాబు, పగడాల శ్రీవిద్య పాల్గొన్నారు.