తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్‌ పాండే
నవతెలంగాణ-కొత్తూరు
తెలంగాణలోని బిఆర్‌ఎస్‌ పార్టీ అవినీతి అక్రమాలను ఎండగట్టి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్‌ పాండే అన్నారు. పార్లమెంట్‌ ప్రవాష్‌ యోజనలో భాగంగా ఆయన శుక్రవారం మండలంలోని ఎస్బి పల్లి నుంచి కొత్తపేట వరకు కేంద్ర సిఆర్‌ఎఫ్‌ నిధులతో నిర్మిస్తున్న రెండు వరుసల బిటి రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్బి పల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఎస్బి పల్లి నుండి కొత్తపేట వరకు సిఆర్‌ఎఫ్‌ నిధులు 20 కోట్లతో నిర్మిస్తున్న పనులు 70 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ నుండి జహంగీర్‌ పీర్‌ దర్గా 15 కోట్లు, ఆమనగల్‌ నుండి షాద్‌నగర్‌ వరకు 37 కోట్లతో బీటీ రోడ్డు పనులు పూర్తి చేశామని అన్నారు. అంతే కాకుండా హైదరాబాద్‌ నుండి బెంగళూరు వరకు జాతీయ రహదారి విస్తరణ నిమిత్తం 900 కోట్ల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. దాంతో పాటు రాష్ట్రంలోని జాతీయ రహదారులు ఇతర రోడ్ల అభివృద్ధి నిమిత్తం 6,500 కోట్ల రూపాయలను కేటాయించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. బిజెపి సర్పంచ్‌ గా ఉన్న గ్రామాలకు నిధులను కేటాయించకుండా వారిని ఇబ్బంది పెడుతుందని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ అవినీతి పాలన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర, జాతీయ నాయకత్వం అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటుందని అన్నారు. ఎస్బి పల్లి గ్రామ సర్పంచ్‌ అంబటి ప్రభాకర్‌ గ్రామ శివారులో ఇండిస్టియల్‌ నిమిత్తం 300 ఎకరాలను ప్రభుత్వం తీసుకుందని అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం నిర్మిస్తున్న రెండు వరసల రోడ్డు ఏ మాత్రం సరిపోదని దీనిని నాలుగు వరుసల రోడ్డుగా మార్చాలని ఆయనకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నియోజకవర్గ ముఖద్వారం తిమ్మాపూర్‌ వద్ద ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, నాయకులు పాలమూరు విష్ణువర్ధన్‌ రెడ్డి, అందే బాబయ్య, మిధున్‌ రెడ్డి, శ్రీ వర్ధన్‌ రెడ్డి, తిరుపతిరెడ్డి, దేపల్లి అశోక్‌ గౌడ్‌, అమడా పురం నరసింహ గౌడ్‌, మల్‌ రెడ్డి మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.