చినుకు తూలిక

చినుకు తూలికతుంటరి గాలి ముద్దాడగానే
సిగ్గిల్లిన మబ్బు తునక
ఇంద్ర ధనుస్సు కొంగులో దూరి
పెదవంచుల తడి తుడుచుకుంది

మోహ పరవశాల కుర్రనింగి
గుండె జారిపోయిన సంగతే మరచి
అరమోడ్పు కన్నుల నూగుమీసం చివర
చిరు చినుకులుగా రెక్క తొడిగింది

మట్టిగువ్వకూ చెట్టుపువ్వుకూ
తడిదేరేలా బుగ్గలు నిమిరి
పుప్పొడి రంగుల్లో జలకాలాడి
కురులనింగి నేలమెడకు చక్కిలిగింతయ్యింది

చిటపట కొమ్మల మీద కొత్తగా
నవ్వుచుక్కై మొలిచిన పువ్వులా
వాన వసంతానికి వన్నెలద్దింది
వయసుకొచ్చిన నది
లయను అందుకుంది

యానగాలికి వానమబ్బు ఆటపట్టైంది
ఏటిపాటకి నీటిబొట్టు ఆయువుపట్టైంది
అగాధంలాంటి జగత్తుకోరే
ఆశల జల్లుల్లో అలల జలసిరంతా
కలల రెప్పల మీద ఒత్తిగిల్లింది!
– కంచరాన భుజంగరావు, 9441589602