సమగ్ర శిక్ష ఉద్యోగుల డీఎస్‌ఈ ముట్టడి

– భారీగా తరలొచ్చిన ఉద్యోగులు
– కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
– మినిమం టైంస్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌
– ఆర్‌ కృష్ణయ్య, స్వరూపరాణి, యాదగిరి, సురేందర్‌ సహా పలువురి అరెస్టు
– లక్డికాపూల్‌ వద్ద కొద్దిసేపు ట్రాఫిక్‌ జాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమగ్ర శిక్ష, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించా లని కోరుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుల (డీఎస్‌ఈ) కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు తరలొచ్చారు. అయితే అప్పటికే విద్యాశాఖ కార్యాలయం వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఉద్యోగులు ఫ్లకార్డులు ప్రదర్శించి న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులకు, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయినా కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఉద్యోగులు యత్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లక్డికాపూల్‌ వద్ద కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య, టీపీసీసీ నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు స్వరూపరాణి, కార్యదర్శి డి యాదగిరి, గౌరవాధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, నాయకులు ఎం సురేందర్‌ సహా వందలాది మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని గోషామహల్‌ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా స్వరూపరాణి, యాదగిరి మాట్లాడు తూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, మినిమం టైం స్కేల్‌ను వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టులో జిల్లా, మండల, స్కూల్‌ కాంప్లెక్స్‌, పాఠశాల స్థాయిలో పనిచేస్తున్న క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లు, ఐఈఆర్పీలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్లు, మెస్సెంజర్లు, పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లు, కేజీబీవి, యుఆర్‌ఎస్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, సీఆర్టీలు, పీఈటీ, ఏఎన్‌ఎం, అకౌంటెంట్‌, కంప్యూటర్‌ టీచర్లు, ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్లు, వంటమనుషులు, వాచ్‌మెన్లు, అటెండర్లు, డీపీఓ స్థాయిలో ఏపీఓ, సిస్టమ్‌ ఎనలిస్ట్‌, డీఎల్‌ఎమ్‌ఏ, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్‌ పర్సన్‌, ఆఫీస్‌ సబార్డినేటర్లుగా వివిధ స్థాయిలో పనిచేస్తున్నారని వివరించారు. ఇతర రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం( మినిమం టైమ్‌ స్కేల్‌) అమలుచేస్తున్నారని గుర్తు చేశారు. అదే విధానాన్ని తెలంగాణలోనూ వర్తింపచేయా లని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సమగ్ర శిక్ష, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగ సంఘం నేతలు మొగిలిచెర్ల శ్రీనివాస్‌, కుంచాల భాస్కర్‌, సయ్యద్‌, గురుస్వామి, ప్రవీణ్‌, దుర్గం శ్రీనివాస్‌, యాదగిరి, క్రిష్ణారెడ్డి, సంతోష్‌, సరిత, స్వప్న, మధుసూధన్‌ తదితరులు పాల్గొన్నారు.