అసాంఘిక శక్తులకు సహకరించకండి : డీఎస్పీ రాఘవేంద్రరావు

నవతెలంగాణ-పినపాక
అసాంఘిక శక్తులకు సహకరించవద్దని డీఎస్పీ రాఘవేంద్రరావు అన్నారు. సీఐ శివప్రసాద్‌ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మారుమూల ఆదివాసీ గ్రామం చింతలపాడులో బుధవారం పర్యటించారు. గిరిజనులతో డీఎస్పీ రాఘవేంద్రరావు మాట్లాడుతూ గ్రామాల్లోని యువకులు మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దన్నారు. చక్కగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ నడుస్తున్న నేపథ్యంలో ఓటు హక్కు కోసం ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే తెలియజేయాలని కోరారు. అనంతరం గోదావరి పరివాహక ప్రాంతాలలో పర్యటించి పడవలు నడిపే వారితో మాట్లాడారు. ఎవరైనా కొత్తవారు గోదావరి దాటి వస్తే సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ దిలీప్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.