మొండిగౌరెల్లి అసైన్డ్‌ భూముల్లో నకిలీలు

త్వరలోనే సర్వేనెంబంర్‌ 127పై నిగ్గు తేల్చనున్న అధికారులు ఈ భూమిలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన సంగతి విధితమే ఈ సర్వేనెం 100 ఎకరాలకు పైగా అసైన్డ్‌ భూమి ఉన్నట్టు సమాచారం అసైన్డ్‌ భూమిని ప్లాట్ల పేరుతో విక్రయించిన ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటికే కొంత భూమికి బోండ్రి ఫిక్స్‌ చేసిన అధికారులు కబ్జాదారులకు గుబులు పుట్టిస్తున్న రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని మొండిగౌరెల్లి రెవెన్యూకు సంబంధించిన సర్వే నెంబర్‌ 127లో 100కు పైగా ఎకరాల అసైన్డ్‌ భూమి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ సర్వే నెంబర్‌లో కొంతమంది పేద రైతులకు సాగు చేసుకుని బతకడానికి అప్పట్లో ప్రభుత్వం పట్టాలిచ్చింది. దీంతో కొందరు రైతులు సాగు చేసుకుని జీవన సాగిస్తున్నారు. ఇందులో కొంతమంది అప్పట్లోనే భూమిని వదిలేసి ఉపాధి కోసం అక్కడే పట్టణాలకు వలస వెళ్లారు. అలాంటివారు తిరిగి భూమి కబ్జాలోకి రాలేదు. ఇదే అదనుగా భావించిన ఓ రెడ్డి సామాజిక వర్గానికి వ్యక్తి ఖాళీగా ఉన్న అసైన్డ్‌ భూమిపై కన్ను పడింది. గుట్టు చప్పుడు కాకుండా ప్లాట్ల రూపంలో కొంతమందికి అమ్మేసి సొమ్ము చేసుకున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల అంచనా ప్రకారం మొండి గౌరెల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 127 లో 12 ఎకరాల కు పైగా అసైన్డ్‌ భూమి ఉంది. ఇందులో ఖాళీగా ఉన్న కొంత భూమిపై కబ్జాదారులు కన్నేసి సంబంధిత అధికారులకు తెలియకుండా నిర్మాణాలు కూడా చేశారు. అయితే ఈ విషయంపై కొందరు గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన మండల రెవెన్యూ అధికారులు మూకుమ్మడిగా రెవెన్యూ సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. కబ్జాకు గురైన భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి బోండ్రి ఫిక్స్‌ చేసి స్వాధీనం చేసుకున్నారు. అయితే సర్వే నెంబరు 127 లో ఇంకొన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అసైన్డ్‌ భూమికి సంబంధించి అసలు విషయాన్ని నిగ్గు తెలుస్తామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది సర్వే నెంబర్లలో గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం ఉందని, దీనికి సంబంధించిన ఆధారాలు లేకుంటే కూల్చివేస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై గెస్ట్‌ హౌస్‌ ఓనర్‌ని సంప్రదించగా అధికారులను మేము రెండు రోజులు దీనికి సంబంధించిన సర్టిఫికెట్లను సమర్పించడానికి గడువు తీసుకున్నామని వివరించారు. మేము ఈ గెస్ట్‌ హౌస్‌ కు సంబంధించిన ఆధారాలు ఇవ్వకుంటే అధికారులు ఏ చర్య తీసుకున్నా సిద్ధమేనని గెస్ట్‌ హౌస్‌ ఓనర్‌ తెలిపారు. ఈ విషయంపై కబ్జాదారులు తాము ఎక్కడ బయటపడతామోనని జంక్కుతున్నారు. ఈ సర్వే నెంబర్‌లో రెవెన్యూ అధికారులు ఎంతవరకు నిజానిజాలు తేలుస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసైన్డ్‌ పట్టాలో థర్డ్‌ పర్సన్‌ ఉంటే పీవోటీ కింద నోటీసులిచ్చి స్వాధీనం చేసుకుంటాం : తహసీల్దార్‌ సుచరిత
మండల పరిధిలోని మొండి గౌరెల్లి రెవెన్యూకు సంబంధించిన సర్వే నెంబరు 127లో కబ్జా గురైన భూమిని గుర్తించాం. సర్వే నిర్వహించి ఆ భూమికి బోండ్రి పిక్స్‌ చేసి స్వాధీనం చేసుకున్నాం. ఇందులో 12 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ సర్వే నెంబర్లు మొత్తం భూమిపై త్వరలోనే సర్వే నిర్వహిస్తాం. హక్కుదారులు ఎవరో, పట్టాదారులు ఎవరో గుర్తిస్తాం. ప్రభుత్వం అసైన్డ్‌ భూమిలో పట్టాదారులకు బదులు థర్డ్‌ పర్సన్‌ ఉంటే పిఓటి కింద నోటీసులిచ్చి స్వాధీనం చేసుకుంటాం. సర్వే నెంబర్‌ 127లో ఇంకా కొంత భూమి కబ్జా కు గురైంది. ఇందులో కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేశారు. త్వరలోనే సర్వే నిర్వహించి అసలు విషయాలను నిగ్గు తెల్చి, బయట పెడతాం. ప్రభుత్వ భూమిలో కబ్జాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.