నవతెలంగాణ-అండమాన్
అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.0గా నమోదైనట్లు వెల్లడించింది. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. కాగా, గడిచిన ఐదు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించడం ఇది రెండో సారి.
అంతకు ముందు జులై 29వ తేదీన అర్ధరాత్రి 12.53 గంటల ప్రాంతంలో అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 69 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప కేంద్రం పోర్టు బ్లెయిర్‌కు 126 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.
ఐదు రోజుల వ్యవధిలోనే ఆ ప్రాంతంలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.