ఈడీ డైరెక్టర్‌ పదవీ కాలాన్ని పొడిగించాలి

– సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రప్రభుత్వం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చీఫ్‌ సంజరు కుమార్‌ మిశ్రా పదవీ కాలం అక్టోబర్‌ 15 వరకు పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో బుధవారం కేంద్ర ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. పదవీకాలం పొడిగింపు విషయంలో ఇదివరకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. తాజా పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయాలని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టును కోరారు. గురువారం ఈ పిటిషన్‌ను జాబితా చేసేందుకు జస్టిస్‌ బిఆర్‌ గవారు నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు పిటిషన్‌ను విచారించడానికి అంగీకరించింది. ఈడీ అధిపతిగా 2018 నవంబర్‌లో సంజరు కుమార్‌ మిశ్రా నియమితులయ్యారు. రెండేండ్ల తరువాత (60 ఏండ్ల వయసు వచ్చిన) ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, 2020 నవంబర్‌ 13న ఆయన పదవీ కాలాన్ని రెండేండ్ల నుంచి మూడేండ్లకు మార్చే విధంగా రాష్ట్రపతి 2018 ఉత్తర్వులను సవరించినట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌, స్వచ్ఛంద సంస్థ కామన్‌ కాజ్‌తోపాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సంజరు కరోల్‌లతో కూడిన ధర్మానసం జులై 11న సంజరు మిశ్రా పొడిగింపు కుదరదని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. జులై 31 తరువాత ఆయన ఆ పదవిలో ఉండరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆ లోపు ఈడీకి కొత్త అధిపతిని నియమించుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ క్రమంలోనే కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.