జర్నలిస్టుకు పాలిటిక్స్‌ ఎఫెక్ట్‌

– ‘రాజకీయాల’ కారణంగా ఉద్యోగాలు ఊస్ట్‌
– సగం మందికి పైగా జర్నలిస్టుల ఆందోళన
– మీడియా సంస్థలు అధికార బీజేపీకే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని వెల్లడి
– తాజా నివేదిక సమాచారం
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజంలో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న జర్నలిస్టులు ఉద్యోగ పరంగా అభద్రతా భావంతో ఉంటున్నారు. రాజకీయ అభిప్రాయాలు, ఒత్తిళ్ల కారణంగా ఉద్యోగాలు కోల్పోవటంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. భారతీయ మీడియా లోక్‌నీతి, సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దాదాపు సగం మంది జర్నలిస్టులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తమ ఉద్యోగాలను కోల్పోతున్నారనే ఆందోళనతో వివిధ స్థాయిలలో బాధపడుతున్నారని సర్వేలో చెప్పారు. 16 శాతం మంది జర్నలిస్టులు తమ సంస్థలోని వ్యక్తులను రాజకీయ ఒరవడి కారణంగా ఉద్యోగం నుంచి నిష్క్రమించాలని కోరబడ్డారని చెప్పారు. ‘ఇండియన్‌ మీడియా: ట్రెండ్స్‌ అండ్‌ ప్యాటర్న్స్‌’ పేరుతో జరిపిన అధ్యయనంలో కీలకమైన అంశం ఏమిటంటే సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తమ మీడియా సంస్థ అధికార బీజేపీకి మద్దతు ఇస్తున్నదని ప్రతిస్పందించారు.
స్వతంత్ర జర్నలిస్టుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే బీజేపీకి అనుకూలంగా ఉండే వార్తా సంస్థల సంఖ్య 89 శాతానికి పెరిగింది. ఇంగ్లిష్‌ న్యూస్‌ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేస్తున్న జర్నలిస్టులలో ఐదింట నాలుగు వంతుల మీడియా సంస్థలు సాధారణంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. సగం మంది ఆంగ్ల భాషా జర్నలిస్టులు తమ రాజకీయ అభిప్రాయాల ఆధారంగా కార్యాలయంలో వివక్షను ఎదుర్కొంటున్నట్టు నివేదించారు. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు స్వతంత్ర జర్నలిస్టులలో నలుగురికి పైగా (82 శాతానికి పైగా) వార్తా ప్రసార మాధ్యమాలు సాధారణంగా కవరేజ్‌ విషయానికి వస్తే కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఒక వార్తా సంస్థలో పనిచేసిన వారి విషయానికి వస్తే ఈ సంఖ్య 70 శాతంగా ఉన్నది. 74 శాతం మంది సీనియర్‌ జర్నలిస్టులు ఒకే రాజకీయ పార్టీకే మొగ్గు చూపుతున్నారని చెప్పారు. హిందీ జర్నలిస్టుల (64 శాతం మంది) కంటే ఎక్కువ మంది ఆంగ్ల జర్నలిస్టులు (81 శాతం) వార్తా ప్రసార మాధ్యమాలు నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా ఉన్నాయని విశ్వసించారు. జర్నలిస్టులు, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో పనిచేస్తున్నవారు పత్రికా స్వేచ్ఛ లేకపోవడం గురించి ఆందోళన చెందుతున్నామని చెప్పారు సహజంగానే అధిక సంఖ్యలో మహిళా జర్నలిస్టులు మగవారితో పోలిస్తే లింగ-సంబంధిత వివక్షను ఎదుర్కొంటున్నట్టు తేలింది. దాదాపు పది మందిలో ఏడుగురు జర్నలిస్టులు వారి ప్రస్తుత ఉద్యోగం కారణంగా వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపినట్టు తెలిపారు. ఇది పురుషుల (66 శాతం) కంటే ఎక్కువ మంది స్త్రీలను (89 శాతం) ప్రభావితం చేస్తుందని వెల్లడించటం గమనార్హం.సర్వేలో అభిప్రాయాలను పంచుకున్న జర్నలిస్టులలో 69 శాతం మంది సోషల్‌ మీడియాలో ప్రసారం చేయబడిన సరికాని సమాచారం ద్వారా తప్పుదారి పట్టించే అవకాశం గురించి చాలా ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా జర్నలిస్టులు పని చేసే విధానాన్ని మరొక విధంగా ప్రమాదంలో పడేస్తుందన్నారు. టీవీ, ప్రింట్‌ జర్నలిస్టులతో పోలిస్తే డిజిటల్‌ జర్నలిస్టులు ఆన్‌లైన్‌ వేధింపుల రేట్లు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని తేలింది.
అలాగే, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గోప్యతకు సంబంధించి ఐదింట రెండు వంతుల మంది జర్నలిస్టులు అధిక స్థాయిలో అభద్రతను వ్యక్తం చేస్తున్నారని వెల్లడైంది. భారతీయ వార్తా మాధ్యమాలలో మహిళలు, గ్రామీణ ప్రాంతాలు, రైతులు, ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, పేదలు వంటి అణగారిన వర్గాలపై తగిన దృష్టి లేదని జర్నలిస్టులు భావిస్తున్నారని నివేదిక పేర్కొన్నది. ”అంతేకాకుండా, సర్వేలో పాల్గొన్న జర్నలిస్టులలో సగానికి పైగా తమ న్యూస్‌ మీడియా ఉద్యోగాలను పూర్తిగా విడిచిపెట్టి మరేదైనా కొనసాగించాలని ఆలోచిస్తున్నారనే వాస్తవం ఆందోళన కలిగిస్తుంది. ఇది వృత్తి పట్ల లోతైన అసంతప్తిని సూచిస్తున్నది. అంతర్లీన కారణాల గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నది”అని నివేదిక వివరించింది.