ఆ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తా..

-ఆదివాసీల అభివృద్ధికి
కలిసి పనిచేయాలి
– భద్రాద్రిలో గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆదివాసీలతో ముఖాముఖి
నవతెలంగాణ-భద్రాచలం
ఆంధ్రాలో విలీనమయిన ఐదు గ్రామ పంచాయతీలు కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయా గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్‌ హాల్‌లో ఆదివాసీలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి గవర్నర్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆంధ్రాలో కలిసిన ఐదు పంచాయతీ గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి తన వంతుగా బైక్‌ అంబులెన్సులు, విద్యుత్‌ ఆటోలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఆదివాసీల పిల్లల విద్యాభివృద్ధికి అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసీల ఆర్థిక, ఆరోగ్య పరిరక్షణ చర్యల్లో భాగంగా గిరిరాజా కోళ్లు, చిరుధాన్యాలతో కూడిన ఆహారం అందించడంలో పాలు పంచుకోవడం చాలా సంతోషమని చెప్పారు. ఆర్థిక అభివృద్ధికి స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలు, మహిళా సాధికారత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య పరిరక్షణా చర్యలో భాగంగా.. అనీమియా, మలేరియా, మాల్‌ న్యూట్రిషన్ల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని, రెడ్‌ క్రాస్‌ ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు. తెలంగాణకు సరిహద్దునున్న రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించుటలో భద్రాచలం ఏరియాస్పత్రి ప్రధాన మైనదని, దాంట్లో డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది. ఖాళీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భద్రాచలం శాసనసభ్యులు భర్తీకి చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేను కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, అయినప్పటికీ వారి జీవితాల్లో ఆశించిన స్థాయిలో మార్పులు రాకపోవడానికి గల కారణాలపై అన్వేషణ చేస్తా మన్నారు. కాగా, తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్‌ తాను తమిళనాడు ఆడబిడ్డనని, తెలంగాణకు అక్కనని చెప్పారు. కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య, గవర్నర్‌ ప్రయివేటు కార్యదర్శి భవాని శంకర్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ మధుసూదన్‌, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, సహాకార అధికారి వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్‌ అధికారి సులోచనా రాణి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, ఏపీఓ జనరల్‌ డేవిడ్‌ రాజు, ఆర్డీఓ రత్నకళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి రామున్ని దర్శించుకున్న గవర్నర్‌
శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ దర్శించు కున్నారు. గవర్నర్‌కు పూర్ణ కుంభంతో ఆలయ అర్చ కులు, ఆధికారులు స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం దర్శనానికి విచ్చేసి క్యు లైన్‌లో ఉన్న భక్తులను గవర్నర్‌ పలకరిం చారు. ఇదిలా ఉండగా జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ డాక్టర్‌ వినీత్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ గౌతమ్‌ పొట్రూ, భద్రాచలం ఆర్డీవో రమాదేవి, ఐటీడీఏ ఏపీఓ జనరల్‌ డేవిడ్‌ రాజ్‌ తదితరులు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతించారు.