ఓటమి భయంతోనే ఎన్నికలు వాయిదా

నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీబీజీకేస్‌ మిగతా సంఘాలు సింగరేణిలో ఎన్నికల వాయిదాకు కుట్ర పన్నుతున్నారని, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ బ్రాంచ్‌ సెక్రటరీ వై.రామ్‌ గోపాల్‌ అన్నారు. పీవీ కాలనీలోని కేఎల్‌ మహేంద్ర భవన్‌లో కార్యకర్తలతో మాట్లాడుతూ గుర్తింపు కాలం పూర్తయిన యాజమాన్యం ఎన్నికలు నిర్వహించానందున కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పరిష్కరించవలసిన అనేక సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు. సంస్థ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కార్మికుల పక్షాన కోర్టును ఆశ్రయించి విజయం సాధించామన్నారు. కానీ యజమాన్యం వివిధ సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం కను సన్నలలో మెలుగుతూ మూడు సందర్భాల్లోనూ ఎన్నికలు వాయిదా కోరుతూ టీబీజీకేఎస్‌కు వత్తాసు పలుకుతూ వస్తుందని అన్నారు. సెప్టెంబర్‌ 11వ తేదీన డీసీఎల్‌సీ కార్యాలయంలో అన్ని సంఘాలు ఎన్నికలు నిర్వహించాలని హాజరై తదుపరి యాజమాన్యం ఏరియర్స్‌ పేరిట సెప్టెంబర్‌ 22కు వాయిదాకు అంగీకరించి ఆరోజు కూడా సెప్టెంబర్‌27వ తేదీ ఎన్నికల షెడ్యూల్‌కు ఒప్పు కున్నారన్నారు. మధ్యలో మరల యాజమాన్యం కుంటి సాకులతో కోర్టుకు పోగా ఏఐటీయూసీ వేసిన కేసు కారణంగా యాజమాన్యం అభ్యర్థనను కోర్టు కొట్టివేసి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించిందని అన్నారు. ఈ తరుణంలో 27వ తేదీన డీసీఎల్‌సీ కార్యాలయానికి హాజరు కావాల్సిన సంఘాలు మేనేజ్మెంట్‌తో కుమ్ముక్కు అయ్యి సింగరేణి బవన్‌లో కూర్చుని అసెంబ్లీ ఎన్నికల తరువాత సింగరేణి ఎన్నికలు నిర్వహించాలంటూ లేఖలు పంపడం కార్మిక వర్గాన్ని మోసం చేయడమే అని అన్నారు. డీసీఎల్‌సీ వద్ద అన్ని సమావేశాలలో టీబీజీకేఎస్‌తో సహా ఎన్నికలు డిమాండ్‌ చేసిన సంఘాలు ఎవరి ప్రయోజనం కొరకు ఎన్నికలు వాయిదా అంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో మల్లెల రామ నరసయ్య, ఆవుల నాగరాజు, అబ్దుల్‌ సుభానీ, కోడి రెక్కల శ్రీనివాసరావు, సాయి ప్రకాష్‌ చారి, ఆంథోనీ, రవి కుమార్‌, యూనియన్‌ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.