– పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
– వ్యకాస జిల్లా కార్యదర్శి పొన్నం డిమాండ్
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
ఉపాధి కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్‌లో శుక్రవారం వ్యకాస ఖమ్మంరూరల్ మండల విస్తృత సమావేశం పొన్నెకంటి సంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పొన్నం మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి పని ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాటు చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఉపాధి కార్మికులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేయాలన్నారు. ఉపాధి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సంఘం ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయాలు ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్, వ్యకాస రాష్ట్ర నాయకులు యర్రా శ్రీనివాసరావులు మాట్లాడారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, జింక బాలరాజు, శానం వీరబాబు, తిరపయ్య, యాదగిరి, గుర్రం ఉపేందర్, చెరుకూరి మురళీకృష్ణ, మల్లికార్జున్, తమనబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.