– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
– మహిళా సాధికారత, గృహహింస, ఉపాధి, ఆరోగ్యంపై సమీక్షా సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఉన్న చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్నదని, మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో గల ప్రజావాణి హాల్‌లో శుక్రవారం ‘మహిళా సాధికారత, గృహహింస, ఉపాధి, ఆరోగ్యం’పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసిందని, 181, 100, శిశు సంరక్షణ (చైల్డ్ వెల్ఫేర్)కు 1098, సైబర్ క్రైంకు సంబంధించి 1930కు ఫోన్ చేస్తే వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ప్రత్యేకంగా పోక్సో చట్టాన్ని అమలు చేయడంతోపాటు పోష్ యాక్టు కింద అన్ని శాఖల్లో (డిపార్టుమెంట్) వీటిని అమలు చేయాలని సూచించారు. విద్యార్థినులకు ప్రత్యేకంగా కాలేజీలు, హాస్టళ్లను ఏర్పాటు చేసి ఇంటిని మరిచేలా అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందజేయడంతోపాటు విదేశాల్లో చదువుకునేందుకు సాయం చేస్తున్నట్టు చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కింద విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులకు రూ.20 లక్షలు అందిస్తున్నట్టు తెలిప్పారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన తర్వాత ఇంటికి వెళ్లే వరకు ఎంతో బాధ్యతగా చూసుకోవడంతోపాటు వారికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్, కేసీఆర్ కిట్, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు అందజేస్తూ వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో ఇంటి వద్దకు చేర్చుతున్నట్టు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మహిళలకు ఎప్పటికప్పుడూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమానికి తోడ్పాటునందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన, సంక్షేమానికి తీసుకున్న వివరాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి కృష్ణారెడ్డి, డీసీపీ ఉషారాణి, కమిషన్ జాయింట్ డైరెక్టర్ శారద, సభ్యులు ఈశ్వరీబాయి, పడాల పద్మ, సూదం లక్ష్మీ, రేవతి తదితరులు పాల్గొన్నారు.