రేపటినుంచి ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌

– 6 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు
– 9 నాటికి సీట్ల కేటాయింపు
– సవరణ షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎంసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ బుధవారం సవరణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. శుక్రవారం ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండడంతోపాటు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశముందని తెలిపారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న అభ్యర్థులకు ఈనెల ఐదున ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఈనెల ఆరు వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని వివరించారు. తొమ్మిదో తేదీ నాటికి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. తొమ్మిది నుంచి 11 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలనీ, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. సీట్ల రద్దుకు ఈనెల 11న అవకాశముందని పేర్కొన్నారు. తొమ్మిది నుంచి 11 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు.
ఈనెల 12 వరకు అభ్యర్థులు చేరిన వివరాలను కాలేజీలు అప్‌డేట్‌ చేయాలని తెలిపారు. ఈనెల 17 నుంచి ప్రత్యేక విడత ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 18న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించారు.
ఈనెల 17 నుంచి 19 వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని సూచించారు. 23 నాటికి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 23 నుంచి 25 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలనీ, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో కాలేజీల్లో రిపోర్టు చేయాలని తెలిపారు. ఈనెల 23న స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని వివరించారు. ఇతర వివరాలకు https://tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.