నీ పాటే చాలు బాలు !

Enough with you boy!పాటకు అమరత్వం అందించిన
గంధర్వ గాయకుడివై
ఘంటసాల వారసుడిగా
తెలుగు సినీ సంగీత
కాగడాను దేశమంతా
రగిలించిన వాడా!
పాటను ప్రేమించి
సంగీతాన్ని శ్వాసించి
గానమే ప్రాణమని
జీవితాన్ని వెలిగించిన రేడా!
నీ గొంతు మోగని సమయం
రేడియో టీవీలకు ఉంటాయా?
నీ పాట వినని రోజున
తెలుగు గుండె లయించదులే!
చిరుగాయకులను చేరదీసి
‘పాడుతా తీయగా’ అంటూ
సంగీత వినీలాకాశంలో
రెక్కలు తొడిగి విహరింపజేసి
‘స్వరాభిషేకం’ చేసిన నాదబ్రహ్మవు!
తీయని తెలుగుపాటల పూతోటలో
లేలేత కోయిల కుహూరవాలు నీవే!
ఇంటింటిలో గుండె గుండెలో
నీ మధుర గాన సవ్వడుల రవళులే!
పాట ఆయువు భావంలో ఉంటుందని
కవి ఎదను నీ పాటల్లో నిజాయితీగా
ఆవిష్కరించిన భాషా ప్రేమికుడా!
సంగీతానికి ఎల్లలుండవని
ఏ భాష ఏ యాస అడ్డుకావని
వేవేల పాటల విత్తుల్ని నాటి
తెలుగు నేలను పులకింప చేసిన
పాటల కషీవలుడివి నీవు!
అందంగా ఇమిడ్చిన గొంతుతో
పాత్రల పరకాయ ప్రవేశం చేసి
పలికిన సప్తవర్ణ రాగాలు
పసి(డి) పలుకులు ప్రేమ విరహం
భక్తి, విప్లవ జానపదాలు నీ గొంతులో
పురివిప్పి నాట్యమాడేవి!
పాట పద్యం మాట నటన
సంగీతం అనుకరణలతో
బహుముఖీన సకళకళా ప్రపూర్ణిడివి!
నీవు మమ్ము వదిలివెళ్లినా
నీ పాట ఎప్పుడూ మాతోనే ఉంటుంది!
ఎదురులేని నాలుగు దశాబ్దాల
నలుభైవేల నీ పాటల మకరందం
గ్రోలేందుకై ఎగిరే తుమ్మెదలెందరో?
నీ సంగీత జైత్రయాత్రలో
నీ పాటల పరిమళాల గుబాళింపులు
సంగీత ప్రేమికుల ఎదల్లో సజీవంగా
సదా అలరిస్తూ ఉంటాయిలే!

(25న బాలు 3వ వర్ధంతి)
– డా. కె. దివాకరాచారి
9391018972