సమాన పనికి సమాన వేతనమివ్వాలి

– కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి : జేవీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, సమాన పనికి సమాన వేతనమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 40 శాఖల్లో సుమారు 1,40,000 మంది పనిచేస్తున్నారనీ, సివిల్‌ సప్లరు, రెవెన్యూ, విద్యాశాఖల్లో పని చేసే సిబ్బందికి రెన్యూవల్‌ చేయకపోవడం వల్ల నెలల తరబడి వారి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. జీవో నెంబర్‌ 60 విడుదలై రెండేండ్లు దాటుతున్నా నేటికీ అనేక శాఖల్లో అమలుకు నోచుకోవడం లేదన్నారు. 20 ఏండ్ల నుంచి అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు యూనివర్సిటీలు, వైద్యారోగ్య, గ్రామ పంచాయతీ, కేంద్ర – రాష్ట్ర పథకాల్లో పనిచేసేవారినీ, ఆయా శాఖల్లో ఏజెన్సీల ద్వారా రిక్రూట్‌ చేసిన ఉద్యోగులతో సహా అందర్నీ పిఆర్‌సి జీఓ పరిధిలోకి తేవాలని డిమాండ్‌ చేశారు.
పాలిటెక్నిక్‌ కళాశాల్లో పనిచేసే 200 మంది నాన్‌టీచింగ్‌ సిబ్బందిని వెంటనే రెన్యూవల్‌ చేయాలని కోరారు. టెర్మినేట్‌ చేసిన 23 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి వారంలో జీతాలు చెల్లించేలా చూడాలని సీఎస్‌ను కోరారు. పెండింగ్‌ వేతన బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల దీర్ఘకాలిక సర్వీస్‌ను పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్‌ చేయాలని సీఎస్‌ను కోరారు.