జాతీయ విద్యా విధానం-2020పై వ్యాసరచన పోటీలు

– ఇంగ్లీష్‌, తెలుగు విభాగాల్లో విద్యార్థులకు, పెద్దలకు వేర్వేరుగా నిర్వహణ
– వ్యాసాలు పంపేందుకు తుది గడువు ఆగష్టు 6
– 15న విజేతలకు బహుమతుల అందజేత : రాజ్‌భవన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘విద్యలో సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో జాతీయ విద్యావిధానం-2020 పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీలను ఈ ఏడాది నిర్వహించనున్నట్టు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రకటించారు. ఈ పోటీలు తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. వ్యాసాలను వార్డ్‌, పీడీఎఫ్‌ పైళ్ల రూపంలో ఆగస్టు ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ్‌రతీbవరఝyషశీఅ్‌వర్‌ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ పంపాలని సూచించారు. విజేతలకు స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా బహుమతులను, పారితోషికాలను అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాజ్‌భవన్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయా విభాగాల్లో మొదటి బహుమతిగా రూ.10వేలు, రెండో బహుమతిగా రూ.5 వేలు, మూడో బహుమతిగా రూ.3 వేలు, ఉత్తమ వ్యాసాల కింద మరో 20 మందికి రూ.1000 చొప్పున ప్రోత్సాహక బహమతులను అందజేస్తామని తెలిపింది. అదే సమయంలో ఈ పోటీల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ మెయిల్‌ ద్వారా సర్టిఫికెట్లు పంపుతామని పేర్కొంది. తెలంగాణలోని విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ వ్యాస రచన పోటీల్లో పాలుపంచుకోవచ్చుననీ, అయితే, వ్యాసరచన 3 వేల పదాలకు మించకూడదని సూచించింది. పేపర్లను పలువురు ప్రొఫెసర్లు మూల్యాంకనం చేస్తారని పేర్కొంది. ఈ పోటీల్లో పాల్గొనేవారు తమ పేరుతో పాటు తల్లిదండ్రుల పేర్లు, కాంపిటేషన్‌ కేటగిరీలను పొందు పర్చాలని సూచించింది. సొంత రచనలో ఉపయోగపడిన పుస్తకాలు, సమాచారం సేకరణ, సొంత అధ్యయనంపై డిక్లరేషన్‌ ఇవ్వాలనీ, అదే సమయంలో సైట్లు, ఇతరత్రా వనరుల ద్వారా సమాచారాన్ని కాపీ కొట్టలేదనే విషయంపైనా స్పష్టత ఇవ్వాలని పేర్కొంది.