సామాజిక స్పృహతోనే కుటుంబ సంక్షేమ నిధి ఏర్పాటు

With social consciousness
Establishment of Family Welfare Fund– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి
– మరణించిన టీచర్‌ కుటుంబానికి రూ.6 లక్షల చెక్కు అందజేత
నవతెలంగాణ-శంషాబాద్‌
సామాజిక స్పృహతోనే టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో కుటుంబ సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని కొత్వాల్‌ గూడ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, టీఎస్‌ యూటీఎఫ్‌ సభ్యురాలైన హెబ్సిక(50) గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఆమె దశదిన కర్మను శంషాబాద్‌లోని మిషన్‌ కాంపౌండ్‌లో నిర్వహించగా, కార్యక్రమానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో పాటు టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి హాజరై.. మృతురాలి భర్త ప్రవీణ్‌కుమార్‌కు రూ.6 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికారాబాద్‌ జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు అకాల మరణం చెందడంతో చందాలు వేసుకొని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేశామన్నారు. ఉపాధ్యాయులు అకాల మరణం చెందినప్పుడు వారి కుటుంబాలు వీధిన పడకుండా తక్షణ సహాయం చేయాలనే ఉద్దేశంతో సంఘం ఆధ్వర్యంలో ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఫండ్‌ (ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌)ను జులై 1న ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన అనంతరం ఇద్దరు ఉపాధ్యాయులు అకాల మరణం చెందారన్నారు. ఇటీవల భద్రాచలంలో కొండయ్య (44) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించగా, ఆయన కుటుంబం అత్యంత దయనీయ స్థితిలో ఉందని గ్రహించి, వారం రోజుల్లో ఆ కుటుంబానికి రూ.6 లక్షలు అందజేశామని తెలిపారు. హెబ్సిక అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత, పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయత కలిగిన టీచర్‌ అని కొనియాడారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆమె భర్త కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మానసికంగా కృంగిపోకుండా తన ఇద్దరు పిల్లలను చక్కగా చదివించి భవిష్యత్తులో ప్రయోజకులుగా మారేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వపరమైన అన్ని మరణ సంబంధిత సదుపాయాలు అందించేందుకు తమ సంఘం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఎయిడెడ్‌ స్కూళ్లలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు కూడా ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌లో సభ్యత్వం ఇవ్వాలని శంషాబాద్‌ ఎంబీహెచ్‌ఎస్‌ హెడ్మాస్టర్‌ పి.అనిత విజ్ఞప్తి చేశారు. దీనికి వారు స్పందిస్తూ ఇప్పటికే ఎయిడెడ్‌ స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా టీఎస్‌యూటీఎఫ్‌, ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌లో సభ్యులుగా ఉన్నారని, వారికి కూడా సంఘం తరఫున సహాయం అందుతుందని తెలిపారు. ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు ఐకమత్యంతో సంఘటిత పోరాటాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరించేలా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య, ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ రాజశేఖర్‌ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ కార్యదర్శి ఈ.గాలయ్య, వీఓటీటీ ప్రధాన సంపాదకులు పి.మాణిక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు కే.గోపాల్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, సీనియర్‌ నాయకులు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.