నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఆధ్వర్యంలో మంగళవారంనాడిక్కడి బస్‌భవన్ వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యూనియన్ అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, కే రాజిరెడ్డి మాడ్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపులో ఉన్నప్పుడే ఆనాటి రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కమిటీ వేయించి హర్యానా, పంజాబ్ చండీఘర్‌లలో పర్యటించి వచ్చామన్నారు. ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోవడంతో ఆర్టీసీలు విడిపోయాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విలీనం జరిగిందని వివరించారు. 2019 సమ్మె సందర్భంగా ఇదే తమ ప్రధాన డిమాండ్‌గా ఆందోళన చేశామని గుర్తుచేశారు. ఆ రోజు వ్యతిరేకించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు విలీనం చేయడాన్ని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మిగిలిన డిమాండ్లూ పరిష్కరించాలి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఇతర డిమాండ్లను కూడా సత్వరం పరిష్కరించాలని టీఎస్‌ఆర్టీసీ మెజారిటీ యూనియన్ల జేఏసీ చైర్మెన్ ఈ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్ కే హన్మంతు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వారు మాట్లాడారు. ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. విలీన విధివిధానాలను ముందే తెలపాలనీ, పెండింగ్ పీఆర్సీలు, ఇతర బకాయిలు ఇవ్వాలనీ, పీఎఫ్, ఎస్‌బీటీ, సీసీఎస్ నిధులు ఇవ్వాలని కోరారు. రిటైరైన ఉద్యోగులకు అన్ని బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు.