– శాంతిభద్రతలను కాపాడడం పెద్ద సవాల్
– మౌలిక వసతులపై పెట్టే ప్రతిపైసా భవిష్యత్తుకి భరోసాను ఇచ్చేదే : మొహాలీ ఐఎస్బీ కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘విభజన రాజకీయాలు దేశానికి ప్రమాదం. అయితే ఆ విభజన ఏ స్థాయిలో ఉన్న ఈ దేశం సమైక్యంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నది. విభజన రాజకీయాలు పెద్ద ఎత్తున దేశంలో ఉన్న ఈ తరుణంలో రాజకీయ పార్టీల మధ్య చర్చలు స్ఫృహద్భావ వాతావరణంలో ఉంటా యని ఆశించడం కొంత వాస్తవ దూరమే. మతపరమైన ఉద్రిక్త తలు నెలకొన్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడడం భవిష్యత్‌లో అన్ని ప్రభుత్వాలకు పెద్ద సవాల్. ఒక చిన్న సంఘటన కూడా శాంతిభద్రతల విఘాతానికి దారి తీసే ప్రమాదం ఉంది’ అని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో ఐఎస్బీ క్యాంపస్‌లో ‘అడ్వాన్స్డ్ మేనేజ్‌మెంట్ ప్రొగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ’ కోర్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. పాలనలో తన అనుభవాలను ఆయన అక్కడి విద్యార్థులతో పంచుకున్నారు.
‘తెలంగాణ రాష్ట్రం అనేక ప్రజాస్వామ్య పోరాటాలు, ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్రంగా ఏర్పడింది. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ప్రగతి పథంలో నడపడంలో మేం విజయం సాధించాం. ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రమూ సాధించని విజయాలను అతి తక్కువ సమయంలో సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎనిమిదేండ్లల్లో రాష్ట్రం తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ భారీగా పెరగడం తెలంగాణ అభివృద్ధికి ప్రాథమిక సాక్ష్యం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపేందుకు వినూత్న పాలసీలతో ముందుకుపోయాం. ప్రభుత్వ పరిపాలనలోనూ, పాలసీల నిర్మాణంలోనూ ఇన్నోవేషన్‌ని తీసుకొచ్చిన రాష్ట్రం మాదే. టీఎస్ ఐపాస్ ప్రభుత్వ పాలన ఇన్నోవేషన్‌కి అద్భుతమైన నిదర్శనం’ అని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.
మారుతున్న పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయ నాయ కులకు ఉన్న విజన్ గొప్పదైతే ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తుందని, అందుకు తెలంగాణ తొమ్మి దేండ్ల పాలనే నిదర్శనమన్నారు. నాయకత్వమంటే ప్రతిరోజు నేర్చుకోవడమేనని, రేపటి రోజు బాగుంటుందన్న ఆశను ప్రజలకు అందించగలిగితే ప్రజలు ప్రభుత్వాలకు, పార్టీలకు మద్దతివ్వడంతోపాటు అండగా ఉంటారని తెలిపారు. పాతకాలపు ఆలోచన ధోరణి వల్ల దేశ ప్రగతి కుంటు పడుతున్నదని చెప్పారు. అన్ని దేశాలూ రుణాలను భవిష్య త్తుపై పెట్టుబడిగా చూస్తుంటే భారతదేశంలో మాత్రం రుణాల విషయంలో అనేక అపోహలు ఉన్నాయని పేర్కొ న్నారు. మారుతున్న యువత ఉద్యోగం రాగానే రుణాలు తీసుకుని జీవితాలను బాగుపర్చుకుంటున్న మాదిరే దేశాలు కూడా మౌలిక వసతుల కోసం అవసరమైతే రుణాలు తీసుకుని భవిష్యత్‌పై పెట్టుబడిగా భావించి ముందుకు వెళ్లాల్సిన వినూత్న పరిపాలన విధానాలు ప్రస్తుతం దేశానికి అవసరమన్నారు. మౌలిక వసతులపై పెట్టే ప్రతి పైసనూ దేశ భవిష్యత్‌కు పెట్టే పెట్టుబడిగానే భావించాలన్నారు.గొప్ప విజయం సాధించాలంటే అందుకు తగిన త్యాగాలు చేయాల్సి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు రాజకీయ నాయకులు మినహా యింపు ఏమాత్రం కాద న్నారు. రాజకీయాలను వృత్తిగా ఎంచుకునే అంశం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. విభిన్న రంగాల్లో అను భవం కలిగిన నిపుణులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ప్రజాక్షేత్రంలో గెలవడం యూపీఎస్సీ పరీక్ష కంటే కఠినమైనదని తెలిపారు.
ఈ-వ్యర్థ్యాల నిర్వహణ పెద్ద సవాల్ సెలెక్ట్ మొబైల్స్’మిషన్ ఇ-వేస్ట్’లో మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ముఖ్యంగా ప్రతీ ఇంటిలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల వినియోగం విరివిగా పెరిగిపోయిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మల్టీ బ్రాండ్ మొబైల్స్ బ్రాండ్ రిటైల్ చెయిన్ సెలెక్ట్ మొబైల్స్ కొత్తగా చేపట్టిన ఎలక్ట్రానిక్ వేస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్‌లో ‘మిషన్ ఈ-వేస్ట్’ వినూత్న కార్యక్రమాన్ని సెలెక్ట్ సిఎండి వై గురుతో కలిసి మంత్రి కెటిఆర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వీటి వ్యర్థాల వల్ల వచ్చే సమస్యలు చాలా ఆందోళకరంగా ఉన్నాయన్నారు. కాగా.. వీటిని ఓ క్రమపద్దతిలో సేకరించడానికి సెలెక్ట్ మొబైల్స్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. వ్యర్థాల నిర్వహణపైనే మానవ మనగడ ఆధారపడి ఉందన్నారు. ఏడాదికి దేశంలో 20 లక్షల ఈ-వేస్ట్ ఉత్పత్తి అవుతోందని.. ఇందులో అతి తక్కువ మాత్రమే రీసైక్లింగ్‌కు వస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు బడా వ్యాపార సంస్థలు, రైల్వే, బస్ స్టేషన్లు తదితర కేంద్రాల వద్ద ఇలాంటి వాటి సేకరణ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ-వేస్ట్ ఉత్పత్తులను శాస్త్రీయంగా రీసైకిల్‌కు చొరవ తీసుకోవడం అందరి బాధ్యత అన్నారు.
వాటిపై రూ.10వేల వరకు డిస్కౌంట్ : గురు
పనికిరాని పాత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై రూ.1000 నుంచి రూ.10,000 వరకు డిస్కౌంట్ అందించనున్నామని సెలెక్ట్ సిఎండి వై గురు తెలిపారు. ఆరోగ్యం, పర్యావరణంపై ఈ-వేస్ట్ ప్రభావానికి వ్యతిరేకంగా తాము బాధ్యాతయుతంగా ఓ అడుగు ముందుకు వేశామన్నారు. ఇందుకోసం తమ 150 స్టోర్లలోనూ ప్రత్యేక బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వినియోగదారులు ఆయా ఉత్పత్తులను తమకు అందజేయడం ద్వారా డిస్కౌంట్ ఓచర్లను పొందవచ్చన్నారు.