– 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి : సీఇఓ వికాస్‌రాజ్
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఇఓ) వికాస్‌రాజ్ అధికారులకు సూచించారు. మంగళవారం బంజారాహిల్స్ బంజారా భవన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్ అధికారులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులకు ఓటరు నమోదుపై శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. గతంలో శేరిలింగంపల్లి జోనల్ ఆర్.డబ్లు.ఏ ప్రతినిధులతో సమావేశమైనప్పుడు కొన్ని సమస్యలు తెలియజేశారన్నారు. అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కాలనీల్లో ఓటరు నమోదు చేయాలన్నారు. ఓటరు గుర్తింపులో ఆర్.డబ్లు.ఏ ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. అందుకోసం ముందుగా రెసిడెన్షియల్ కాలనీ ప్రతినిధి సహకారంతో ఓటరు నమోదు చేయాలన్నారు. ఓటరు నమోదు కోసం సంబంధించిన ప్రామాణికతను తెలియజేయడం జరిగిందన్నారు. అర్హులైన వారి ఓటరు నమోదుకు ప్రణాళిక రూపొందించుకొని బీ.ఎల్.ఓలు ముందుకు పోవాలని చెప్పారు. ఓటరు నమోదుకు ఒకేసారి పూర్తి వివరాలతో వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. కాలనీ వాసులే కాకుండా సమీపంలో అర్హత గల వారిని కూడా ఓటరుగా నమోదు చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియ 10 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అడిషనల్ ఎన్నికల ప్రధాన అధికారి లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేయడంలో బూత్ స్థాయి అధికారుల క్రియాశీలంగా వ్యవహరించాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, ఒకే ఇంటిలో ఉన్న వారు ఇంకొక పోలింగ్ స్టేషన్, లేదా బార్డర్ నియోజకవర్గంలో ఉన్న పక్షంలో వాటిని సరి చేయాలన్నారు. అంతేకాకుండా ఫొటోలు మిస్ మ్యాచ్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇంటి నెంబర్, అడ్రస్ మార్పు, ఒకే కుటుంబ సభ్యుల ఓటర్లు ఒకే పోలింగ్ స్టేషన్‌లో ఉండే విధంగా, పుట్టిన తేదీ, రిలేషన్‌లాంటి తప్పులను కూడా సవరించేందుకు కృషి చేయాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులను ఫారం-8 ద్వారా చేయాలన్నారు.
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులతోపాటు ఓటింగ్ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే కుటుంబ సభ్యుల ఓటర్లు విభిన్న పోలింగ్ స్టేషన్‌లో నమోదవుతున్నాయని, వివిధ పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ఓటరు జాబితాలో పేరును చెక్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీఈఓ సర్పరాజ్ అహ్మద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అమరు కుమార్, హరీష్, శరత్, అడిషనల్ కమిషనర్ శంకరయ్య, జాయింట్ కమిషనర్ మంగతయారు తదితరులు పాల్గొన్నారు.