గ్రూప్‌-4 పరీక్ష నిర్వహణకు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలి

– అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ పాల్వంచ
జూలై 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించనున్న గ్రూప్‌ 4 పరీక్ష నిర్వహణకు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు, కేంద్రాల్లో సౌకర్యాలపై ప్రతిపాదనలు అందచేయాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రూప్‌ 4 పరీక్ష నిర్వహణకు పరీక్షా కేంద్రాలు ఎంపికపై ఆదివారం రెవిన్యూ, విద్యా, డిపిఓ, డిఆర్‌ డిఓ, జడ్పి సీఈఓ, మున్సిపల్‌ కమిషనర్లు, తహసిల్దార్లు, యంపిడిఓలు, ఎంపివోలు తదితరులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంపిడిఓ, యంపిఓ, తహసిల్దార్‌, యంఈఓలు పరీక్ష నిర్వహణకు ఎంపిక చేయాల్సిన కళాశాలలు, పాఠశాలలు పరిశీలన చేసి నివేదిక అందచేయాలని చెప్పారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో సుజాతనగర్‌, చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మిదేవిపల్లి, పాల్వంచ, మణుగూరు, ఇల్లందు, భద్రాచలంలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షలకు దాదాపు 30 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. పేర్కొన్న మండలాల్లో కళాశాలలు, పాఠశాలలు తనిఖీ చేపట్టి జారీ చేసిన చెక్‌ లిస్టు ప్రకారం ధృవీకరణ నివేదికలు అందచేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో విద్యుత్‌, కుర్చీలు, ఫ్యాన్లు, ప్రహరిగోడలు, సిసి కేమేరాలు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను నివేదికలో తెలియచేయాలని చెప్పారు. ఎంపిక చేసిన కేంద్రాల చిరునామా పకడ్బందిగా తెలియచేయాలని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌ టిక్కెట్లులో పరీక్షా కేంద్రం చిరునామా ప్రచురించనున్నందున, అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు సులభంగా తెలుసుకోవడానికి వీలుగా చిరునామా స్పష్టంగా తెలియచేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాలు ఏర్పాటుకు ఎంపిక చేయనున్న పాఠశాలలు, కళాశాలలను తహసీల్దార్లు, విద్యా, యంపిడిఓలు, యంపిఓలు సంయుక్తంగా తనిఖీ చేసి రేపటి వరకు 22వ తేదీ సోమవారం వరకు నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ప్రతిపాదించిన పాఠశాలలు, కళాశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రం చేపించాలని పంచాయతీ, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో డీఈఓ సోమశేఖరశర్మ, డిపిఓ రమాకాంత్‌, డిఆర్డిఓ మధుసూదన్‌ రాజు, జడ్పి సిఈఓ విద్యాలత, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు మున్సిపల్‌ కమిషనర్లు రఘు, అంకుష్‌ వలి, ఉమా మహేశ్వరావు, ఆయా మండలాల మండలాల తహసిల్దార్లు, ఎంపిడివోలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.