రూ.12.50 కోట్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పటి వరకు గీత వృత్తిలో ప్రమాదానికి గురై మరణించిన, వికలాంగులైన కార్మికులకు రూ.12.50 కోట్ల ఎక్స్‌గ్రేషియో నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియోను పంపిణీ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. గౌడ వృత్తిదారుల ఆత్మగౌరవ భవనానికి జరిగే భూమి పూజ కార్యక్రమం సందర్భంగా సంబంధిత చెక్కులను పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. మున్ముందు (దశాబ్దిఉత్సవాల అనంతరం) గీత కార్మికులకు రైతు బీమా మాదిరిగా ఎక్స్ గేషియో అందించాలని సీఎం ఆదేశించారని గుర్తుచేశారు. భవిష్యత్‌లో ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు అందించే ఎక్స్‌గ్రేషియో నేరుగా వారి ఎకౌంట్లలో వారం రోజుల వ్యవధిలో రైతు బీమా మాదిరిగా జమ చేస్తామని ప్రకటించారు. ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు, లైసెన్సు, నామిని వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు వారం రోజుల వ్యవధిలో అందజేయాలని మంత్రి సూచించారు. గీత కార్మికుల బీమాను సమర్థవంతంగా అమలయ్యేలా విధివిధానాలు పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫారాజ్ అహ్మద్‌ను మంత్రి ఆదేశించారు.