ఊపిరి తీసిన మద్యం అప్పు

– ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
– ఏకమైన గ్రామస్తులు.. మద్యం బాటిల్లు ధ్వంసం
నవతెలంగాణ-భిక్కనూర్‌
మద్యంకి బానిసయిన ఓ యువకుడు దానికోసం అప్పులు చేసి ఆ బాధ భరించలేక తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు మృతదేహంతో గ్రామంలో ఉన్న బెల్టుషాపు ఎదుట ఆందోళనకు దిగారు. బెల్ట్‌షాపులోని మద్యాన్ని తీసుకువచ్చి గాంధీ విగ్రహం ఎదుట ధ్వంసం చేశారు. గతంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో టెండర్‌ ద్వారా మద్యం అమ్మకాలు కొనసాగిస్తే గ్రామస్తులు మూసి వేయించారు. అయినా అమ్మకాలు అగకపోగా.. గ్రామానికి చెందిన యువకులు మద్యానికి బానిసలవుతున్న ఘటనలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన నాగర్తి నరేష్‌ రెడ్డి (37) మద్యానికి బానిసై అప్పుచేసి మరీ మద్యం సేవించసాగాడు. దాంతో బెల్టు షాపు యజమాని మద్యం డబ్బులు అడగటంతో సోమవారం రాత్రి మరోసారి మద్యం కొనుగోలు చేసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి మద్యం సేవించి అప్పుల బాధ భరించలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు ఏకమై ఇకనుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు చేపడితే రూ.5 లక్షల జరిమానా విధించడం జరుగుతుందని గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఆనంద్‌ గౌడ్‌ తెలిపారు.