– ‘ఇడ్లి’ స్కీం పరిహారం రూ.7 లక్షలకు పెంపు
– ధన్యవాదాలు తెలిపిన ఎస్‌డబ్ల్యూఎఫ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికంటే ముందు పరిష్కరించాల్సిన అంశాలపై యాజమాన్యం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పలు విజ్ఞాపన పత్రాలను పరిగణనలోకి తీసుకొని పరిష్కారాలు చూపుతున్నందుకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఆగష్టు 16 తర్వాత పదోన్నతులు, బదిలీలు ఉండకూడదని యాజమాన్యం ఇటీవల ఓ సర్క్యులర్ ఇచ్చింది. దీనిపై ఎస్‌డబ్ల్యూఎఫ్ అనేక వివరణలతో వినతిపత్రం సమర్పించింది. ఆ అంశాలను పరిశీలించి పదోన్నతులు, బదిలీల్లో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించి, ఆ గడువును సెప్టెంబర్ 11 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే సర్వీసులో ఉండి మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల నామినీకి ఎంప్లాయి డిపాజిటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ (ఇడ్లి) కింద కనిష్టంగా రూ.2.5 లక్షలు, గరిష్టంగా రూ.7 లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ నిర్ణయాన్ని ఎస్‌డబ్ల్యూఎఫ్ స్వాగతించింది. దీనిపై కూడా తమ సంఘం విలీన కమిటీ చైర్మెన్‌తో పాటు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యానికి కూడా వినతిపత్రాలు సమరించామని తెలిపారు. యాజమాన్యం ఇచ్చిన సర్క్యూలర్‌తో కొన్నేండ్లుగా ఎదురు చూస్తున్న దాదాపు 650 కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. అలాగే మిగిలిన సమస్యల పై కూడా సానుకూలంగా స్పందించాలని కోరారు.