పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌లో ఫేస్‌ అథెంటికేషన్‌

–  కేంద్ర ప్రభుత్వ పథకంలో తొలిసారిగా ఇలాంటి విధానం
న్యూఢిల్లీ : మోడీ సర్కారు పీఎం-కిసాన్‌ యాప్‌లో ఫేస్‌ అథెంటిఫికేషన్‌ పద్దతిని తీసుకొచ్చింది. దీంతో ఇకపై రైతులు తమ ఈ-కేవైసీ ప్రక్రియను వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌, వేలి ముద్రలకు బదులుగా మొబైల్‌ ఫోన్‌లలో తమ ఫేస్‌ను స్కానింగ్‌ చేయటం ద్వారా పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ యాప్‌ ఫీచర్‌ను ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్‌ చౌదరీ, సంబంధిత అధికారులు కూడా హాజరయ్యారు. ఫేషియల్‌ అథెంటికేషన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ-కేవైసీని చేసుకునే తొలి ప్రభుత్వ పథకంగా పీఎం-కిసాన్‌ స్కీం నిలిచిందని కొత్త ఫీచర్‌ గురించి వివరాలను వెల్లడిస్తూ అగ్రికల్చర్‌ అదనపు సెక్రెటరీ ప్రమోద్‌ కుమార్‌ మహేంద్ర వెల్లడించారు. పీఎం-కిసాన్‌ మొబైల్‌ యాప్‌లో ఫేస్‌ అథెంటిఫికేషన్‌కు సంబంధించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ పైలెట్‌ టెస్టింగ్‌ను ఈ ఏడాది మే 21న ప్రారంభించిందని ఆయన వివరించారు. అప్పటి నుంచి 3 లక్షల మంది రైతుల ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. వేలిముద్రలు, ఓటీపీల ద్వారా సంబంధిత కేంద్రాల వద్దకు వెళ్లి ఈ-కేవైసీని పూర్తి చేసుకోవడం ఇబ్బందిగా తయారైందనీ, ముఖ్యంగా వృద్ధుల విషయంలో వేలి ముద్రలు సరిపోలటం లేదని అధికారులు తెలిపారు. ఈ-కేవైసీ ప్రక్రియను సులభతరం చేసేందుకే ఫేస్‌ అథెంటికేషన్‌ను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకాన్ని 2019లో ప్రారంభించారు. ఈ పథకం కింద రైతు లబ్దిదారులకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం (ప్రతి నాలుగు నెలలకు మూడు సమాన ఇన్‌స్టాల్‌మెంట్‌లలో) అందుతుంది.