నకిలీ పత్తి విత్తనాల సరఫరా ముఠా అరెెస్టు

– రూ.1.60 కోట్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
– ముగ్గురు అరెస్ట్‌, ఒకరు పరారీ : ఎస్పీ అపూర్వరావు వివరాలు వెల్లడి
నవతెలంగాణ-నల్లగొండ
నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేసే మూఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. కోటీ 80 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు, ఎర్టిగా కారు, నాలుగు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున ఎస్‌ఐ డీ.సైదాబాబు, ఎస్‌ఐ విజరు కుమార్‌, ఎస్‌ఐ ఈ.రవి టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, పక్కా సమాచారంతో నార్కట్‌పల్లి ఫ్లై ఓవర్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా వస్తున్న ఎర్టిగా కార్‌ను ఆపి తనిఖీ చేశారు. అందులో రెండు విడి విత్తనాలు కలిగిన బస్తాలను పట్టుకొని వ్యవసాయ అధికారులను పిలిపించి చెక్‌ చేయించారు. అవి నకిలీ పత్తి విత్తనాలని తెలపగా వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. గోరంట్ల నాగార్జున, గడ్డం రవీంద్రబాబు, మెరిగే వేణు.. కర్నాటకలోని కొంత మంది రైతుల దగ్గర నుంచి పత్తి విత్తనాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా దాచేపల్లి దగ్గర స్టోరేజ్‌ చేసి అక్కడ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్‌కి చెందిన రైతులకు ఎక్కువ ధరకు అమ్మేందుకు తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. నలుగురి నిందితుల్లో ముగ్గురిని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అన్నమయ్య జిల్లాకు చెందిన నరసింహ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నల్లగొండ డీఎస్పీ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో చిట్యాల సీఐ శివరామ్‌రెడ్డి, నార్కెేట్‌పల్లి ఎస్‌ఐ సైదాబాబు, చిట్యాల ఎస్‌ఐ రవి, ఎస్‌ఐ విజరు కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సురేందర్‌, కానిస్టేబుల్స్‌ శివ శంకర్‌, గిరిబాబు, టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.