నోరుజారిన పియూష్‌ గోయల్‌ ‘న్యూస్‌క్లిక్‌’తో ప్రతిపక్షాలకు సంబంధమంటూ తప్పుడు ఆరోపణలు

సభా హక్కుల కింద నోటీసులివ్వడంతో వెనక్కి
న్యూఢిల్లీ : స్వతంత్ర మీడియా సంస్థ ‘న్యూస్‌క్లిక్‌’కు ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలకు సంబంధముందని, వారంతా ‘ట్రాయిటర్స్‌’ (ద్రోహులు) అంటూ రాజ్యసభ సభానాయకుడు, కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ తప్పుడు ఆరోపణలు చేశారు. దీనిపై ప్రతిపక్ష కూటమి ఇండియాకు చెందిన టిఎంసి, ఆప్‌, ఆర్‌జెడి, డిఎంకె, ఆర్‌జెడి, జెడియు, ఎన్‌సిపి, వామపక్షాల నేతలు సభా హక్కుల కింద నోటీసులు ఇచ్చారు. గోయల్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తూ రాజ్యసభ ఛైర్మన్‌కు ఇండియా పార్టీలు నోటీసులిచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలందరినీ ద్రోహులుగా పేర్కొంటూ గోయల్‌ వ్యాఖ్యలు చేసినందుకు సభా హక్కుల నోటీసును అందచేసినట్లు కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేష్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఇండియా పార్టీల నేతలపై తీవ్ర అభ్యంతకరకరమైన రీతిలో, పూర్తిగా ఆమోదయోగ్యం కాని రీతిలో చేసిన వ్యాఖ్యలకు గానూ గోయల్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నా అందుకు తిరస్కరిస్తున్నారని రమేష్‌ తెలిపారు. సభా వేదికగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందేని డిమాండ్‌ చేశారు.
సభలో ఈ విషయమై గందరగోళం చెలరేగింది. దీంతో పార్లమెంటరీయేతర వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకుంటానని సభలో గోయల్‌ చెప్పారు. వాటిని రికార్డుల నుండి తొలగించాల్సిందిగా ఆయన చైర్మన్‌ను కోరారు. కాగా తమకు కొందరు రాజకీయ నాయకులతో సంబంధాలున్నట్లు వచ్చిన ఆరోపణలను న్యూస్‌క్లిక్‌ వార్తా సంస్థ ఖండించింది. ఇవి పూర్తిగా తప్పుడు ఆరోపణలనీ, తమ సంస్థ స్వతంత్రమైనదని, స్వేచ్ఛాయుతంగా నడుపుతున్నామని పేర్కొంది.