రైతు ఆత్మహత్య

నవతెలంగాణ – జమ్మికుంట
అప్పుల బాధ భరించలేక ఓ రైతు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శనివారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో 18వ గేటు వద్ద జరిగింది. రామగుండం రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ జి.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన పంజాల అశోక్‌(40) తన ఎకరం వ్యవసాయ భూమితోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసేవాడు. వరుసగా పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో అప్పులు పెరిగాయి. సుమారు రూ.5లక్షల వరకు అప్పులు ఉండగా.. ఎలా తీర్చాలోనని ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య పంజాల అరుణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రామగుండం జిఆర్‌పి హెడ్‌ కానిస్టేబుల్‌ జి.తిరుపతి తెలిపారు.