అటవీ హక్కు పత్రాల రైతులకు సదావకాశం…

– ఈ ఏడాది నుండే రాయితీ పై ఫాం ఆయిల్ మొక్కలు అందజేత
– జిల్లా వ్యాప్తంగా 21 వేలమంది గిరిజన లకు లబ్ధి
– ఆయిల్ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణ
నవతెలంగాణ-అశ్వారావుపేట : ఆయిల్ఫెడ్ – ఉద్యాన,పట్టు పరిశ్రమలు శాఖ లు అటవీ హక్కు పత్రాలు పొందిన పోడు సాగుదారుల కు సదావకాశాన్ని కల్పించనున్నారు.ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకారం అటవీ హక్కు పత్రాలు పొందిన పోడు సాగుదారుల కు ఈ ఏడాది నుండే ఈ రెండు శాఖలు రాయితీ పై మొక్కలు,ఎరువులు,బిందు సేద్యం పరికరాలు అందించనున్నారు. ఇటీవల జిల్లా స్థాయి సమావేశంలో ఉద్యాన,పట్టు పరిశ్రమలు శాఖ జిల్లా అధికారి జినుగు మరియన్న,ఆయిల్ఫెడ్ డివిజనల్ అధికారి ఆకుల బాలక్రిష్ణ లకు జిల్లా కలెక్టర్ అనుదీప్ అటవీ హక్కులు పొందిన పోడు సాగుదారుల కు రాయితీలు పై మొక్కలు అందజేయాలని ఆదేశించినట్లు డి.ఒ బాలక్రిష్ణ శనివారం తన కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 20 మండలాల్లో 72,572.19 ఎకరాల్లో 21,910 మంది పోడు సాగుదారుల లబ్ధి పొందనున్నారు అని తెలిపారు. ఆయిల్ ఫాం సాగు చేయాలనే ఆసక్తి,ఉత్సాహం ఉన్న గిరిజనులు మొక్కలు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఆయన వెంట ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ రాధాక్రిష్ణ ఉన్నారు.