రైతులు, గ్రామీణుల హక్కులను గుర్తించాలి

– కేంద్రానికి డాక్టర్‌ దొంతి నర్సింహా రెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతులు, గ్రామీణుల హక్కులను కేంద్రం గుర్తించాలని ప్రముఖ వ్యవసాయ విధాన విశ్లేషకులు డాక్టర్‌ దొంతి నర్సింహారెడ్డి కోరారు. నాగపూర్‌లో జరిగిన భారత్‌ బీజ్‌ స్వరాజ్‌ మంచ్‌ (బీబీఎస్‌ఎం) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి 2018లో రైతుల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆ వర్గాలకు మద్ధతుగా నిలిచేందుకు తగిన చట్టాల రూపకల్పనకు పూనుకోవాలని సూచించారు. భారతదేశంలోని వారసత్వ పంటలను, మొక్కల్లో వైవిధ్య రకాలను నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రయివేటైజేషన్‌ తదితర రూపాల్లో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి మేధోపరమైన హక్కులను కాపాడుకోగలుతామని సూచించారు. భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ప్రజా ఉద్యమంలో రైతులు, తోటమాలులు, సామాన్యులు, యువత క్రియాశీలకంగా పాల్గొనాలని దొంతి పిలుపునిచ్చారు.