వినాయకుని విందు…

Feast of Ganesha...వినాయక చవితి రానుంది… చాలా మంది ఇండ్లలో వినాయకుని ప్రతిష్టించుకుని పూజలు నిర్వహించుకుంటారు.వినాయకునికి ఇష్టమైన ఎన్నో వంటలు సిద్ధం చేస్తుంటారు. అందులో ఉండ్రాళ్లు, కుడుములు, లడ్డూలు, పులిహోర, బూరెలు… ఇలా ఎన్నో వెరైటీలుంటాయి. అయితే ఎప్పటిలా కాకుండా వీటినే కాస్త భిన్నంగా చేసి చూద్దాం…!
పూర్ణం కుడుములు
కావాల్సిన పదార్థాలు : శెనగపప్పు – ఒకటిన్నర కప్పులు, బెల్లం – రెండు కప్పులు, తాజా కొబ్బరి తురుము – ఐదు చెంచాలు, యాలకుల పొడి – అర చెంచా,
పైపూత కోసం : బియ్యప్పిండి – మూడు కప్పులు, మంచినీళ్లు – తగినన్ని, నెయ్యి – రెండు చెంచాలు, ఉప్పు – చిటికెడు
తయారు చేసే విధానం : ప్రెషర్‌ కుక్కర్లో శెనగపప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత నీళ్లు వంపేసి గ్రైండర్‌లో మెత్తగా చేసి పక్కన ఉంచాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి కరిగించి, మరిగించాలి. తర్వాత మెత్తగా మెదిపిన శెనగపప్పు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలుపుతూ దగ్గరగా అయ్యే వరకూ ఉడికించాలి. ఇప్పుడు ముద్దని గుండ్రని ఉండల్లా చేసి పక్కన ఉంచాలి. బాణలిలో ఉప్పు, సుమారు మూడు కప్పుల నీళ్లు, నెయ్యి వేసి మరిగించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. తర్వాత ఓ గిన్నెలో బియ్యప్పిండి వేసి మరిగించిన నీళ్లను కొంచెం కొంచెంగా పోస్తూ కలపాలి. చల్లారాక పిండి ముద్దను చిన్న ఉండల్లా చేయాలి. ఒక్కో ఉండనీ చిన్నపాటి పూరీలా అరచేతిలో వత్తి, అందులో పూర్ణం ఉండని పెట్టి, మూసేసి నెయ్యి రాసుకుంటూ నున్నని ఉండలా చుట్టాలి. ఇలాగే అన్నీ చేసుకుని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో పెట్టి సుమారు పన్నెండు నిమిషాలు ఉడికించాలి. చల్లారాక తీస్తే పూర్ణం కుడుములు రెడీ.
పాల వడలు
కావాల్సిన పదార్థాలు : మినప్పప్పు – రెండు కప్పులు, చిక్కటి పాలు – లీటరు, చక్కెర – రుచికి సరిపడా, యాలకులపొడి- చిటికెడు, వేయించిన బాదం పలుకులు – కొన్ని, కిస్మిస్‌ – ఆరు, నూనె – వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : మినప్పప్పును ఆరు నుంచి ఎనిమిది గంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత గారెల పిండిలా మెత్తగా, గట్టిగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో సరిపడా నూనె వేసి వేడయ్యాక పిండిని గారెల్లా వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పాలను ఓ గిన్నెలో తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. అవి అరలీటరు అయ్యే వరకూ మరిగించి అందులో సరిపడా చక్కెర, యాలకులపొడి వేయాలి. పాలు ఇంకాస్త చిక్కగా అయ్యాక దింపేయాలి. వడల్ని ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని వాటిపై ఈ పాలను పోయాలి. బాదం పలుకులూ, కిస్మిస్‌తో అలంకరించాలి. అంతే పాలవడలు సిద్ధం.
నిమ్మకాయ, పొడి పులిహోర
కావాల్సిన పదార్థాలు : బాస్మతి బియ్యంతో వండిన అన్నం – కప్పు, క్యారెట్‌ ముక్కలు- పావు కప్పు, పచ్చి బఠాణీలు – పావు కప్పు, కాబూలీ శెనగలు – పావు కప్పు, కొమ్ము సెనగలు- పావు కప్పు, రాజ్మా – పావు కప్పు, పల్లీలు- పావుకప్పు, పచ్చిమిర్చి- రెండు, నిమ్మకాయ – ఒకటి లేదా మరో అరచెక్క, కరివేపాకు రెబ్బ – ఒకటి, నెయ్యి – చెంచా, నూనె – రెండు చెంచాలు, ఇంగువ – చిటికెడు, పసుపు – పావు చెంచా, ఉప్పు – రుచికి సరిపడా, ఆవాలు – చెంచా.
పొడి కోసం : పల్లీలు – రెండు చెంచాలు, శెనగపప్పు – చెంచా, నువ్వులు – చెంచా, దనియాలు- పావుకప్పు, మెంతులు- పావుచెంచా, ఎండుమిర్చి – మూడు.
తయారు చేసే విధానం : ముందు పొడి కోసం తీసుకున్న పదార్ధాలను నూనె లేకుండా వేయించుకోవాలి. వేడి చల్లారాక పొడిలా చేసుకుని పెట్టుకోవాలి. క్యారెట్‌ ముక్కలూ, బఠాణీలను మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న పల్లీలూ, శెనగలూ, రాజ్మాని కూడా ఉప్పు వేసుకుని ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు వేయించాలి. అందులో పచ్చిమిర్చి, శెనగలు, పల్లీలు, రాజ్మా కూడా వేసి వేయించుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత పసుపు, ఇంగువా, కరివేపాకు వేసి వేయించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఇందులో ముందుగా చేసుకున్న పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నీ, నిమ్మరసాన్నీ అన్నంలో వేసుకుని కలుపుకుంటే సరి.
మోదక్‌
కావాల్సిన పదార్థాలు : బియ్యప్పిండి – కప్పు (బియ్యాన్ని గంట ముందు నాన బెట్టి తర్వాత ఆరబెట్టి పొడిలా చేసుకోవాలి), బెల్లం తురుము – కప్పు, తాజా కొబ్బరి తురుము – కప్పు, వేయించిన గసగసాలు – మూడు చెంచాలు, నెయ్యి – రెండు చెంచాలు, ఉప్పు – చిటికెడు, యాలకుల పొడి – అరచెంచా
తయారు చేసే విధానం : అడుగు మందంగా ఉన్న కడాయిలో కప్పు నీళ్లు తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. నిమిషం తర్వాత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంట తగ్గించి బియ్యప్పిండి వేసేయాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉంటే రెండు నిమిషాలకు అది దగ్గరకు అవుతుంది. అప్పుడు దింపేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు మరో గిన్నెలో పావుకప్పు నీళ్ళు బెల్లం తీసుకుని స్టవ్‌ మీద పెట్టాలి. అది కరిగి పాకంలా అవుతున్న ప్పుడు కొబ్బరి తురుము, వేయించిన గసగసాలు, యాల కుల పొడి వేసి కలపాలి. మూడు నిమిషాల తర్వాత మిశ్రమం దగ్గరికొస్తుంది. అప్పుడు దింపేయాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని బియ్యప్పిండిని తీసుకుని చిన్న చపాతీల్లా చేత్తోనే వత్తుకోవాలి. అందులో కొద్దిగా బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి, మోదక్‌ల షేప్‌లో వచ్చేలా చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా చేసుకున్నాక, అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుని, పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. అంతే మోదక్‌లు రెడీ.
రవ్వ బూరె
కావాల్సిన పదార్థాలు : బొంబాయి రవ్వ – కప్పు, కొబ్బరి తురుము – కప్పు, చక్కెర లేదా బెల్లం తురుము – అరకప్పు, యాలకులు – నాలుగు, ఉప్పు – చిటికెడు, నూనె – వేయించడానికి సరిపడా, నెయ్యి – కొద్దిగా
తయారు చేసే విధానం : నాన్‌స్టిక్‌ పాన్‌లో కొబ్బరి తురుము, చక్కెర లేదా బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలిపి తిప్పుతూ పది, పదిహేను నిమిషాలు వేయించాలి. ప్రెషర్‌ పాన్‌లో మంచినీళ్లు పోసి చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర వేసి మరిగించాలి. మరుగుతుండగా రవ్వ వేసి తిప్పుతూ ఉండలు కట్టకుండా రెండు నిమిషాలు ఉడికించి, దించి పక్కన ఉంచాలి. చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని రవ్వ మిశ్రమాన్ని గుండ్రని ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండనీ చిన్న పూరీలా వత్తి, అందులో కొబ్బరి మిశ్రమం పెట్టి, చేత్తోనే మళ్లీ బూరెల్లా వత్తాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఈ బూరెలను వేసి, సిమ్‌లో వేయించి తీయాలి.
సగ్గుబియ్యం లడ్డు
కావాల్సిన పదార్థాలు : సగ్గుబియ్యం – కప్పు, ఎండుకొబ్బరి తురుము – ముప్పావు కప్పు, పంచదార – ముప్పావు కప్పు, నెయ్యి – ఆరు చెంచాలు, జీడిపప్పు : పది, యాలకులు -ఐదు, జాజికాయ పొడి – పావు చెంచా
తయారు చేసే విధానం : కడాయిలో సగ్గుబియ్యం వేసి సిమ్‌లో వేయించాలి. అవి కాస్త ఉబ్బి, లేత గోధుమ రంగులోకి మారి, కరకరలాడేలా వరకు అరగంట సమయం పడుతుంది. చల్లారాక వీటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేయాలి. మరో కడాయిలో కొబ్బరి తురుము కూడా వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి. అందులోనే సగ్గుబియ్యం పొడి, చక్కెర వేసి కలిపి ఓ నిమిషం పక్కన ఉంచాలి. తర్వాత నెయ్యి కరిగించి పోసి, వేయించిన జీడిపప్పు ముక్కలు, యాలకుల పొడి, జాజికాయ పొడి కూడా వేసి కలుపుకోవాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే లడ్డూల్లా చుట్టాలి.