మీ హక్కు కోసం పోరాడండి

Fight for your rightనలభైవేల మంది కంటే ఎక్కువ మంది మహిళలు ప్రవాస భారతీయులను (ఎన్‌ఆర్‌ఐ) వివాహం చేసుకుని మోసపోయారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తుంది. తనలా మరెవరూ ఇబ్బందులు పడకూడదనుకుంది. తాను మోసపోయినట్టు మరో మహిళ మోసపోకూడదని నిర్ణయించుకుంది. అందుకే ఓ సంస్థను స్థాపించింది. బాధిత మహిళలకు న్యాయ సలహాలు అందిస్తూ వారికి అవసరమైన సహాయం చేస్తుంది. ఆమే లూథియానాకు చెందిన సత్వీందర్‌ కౌర్‌.
ప్రీతమ్‌ కౌర్‌కి పెండ్లయినపుడు వయసు 18 ఏండ్లు. వివాహం జరిగిన కొద్దికాలానికే భర్త కెనడాకు వెళ్లాడు. త్వరలోనే ఆమెను కూడా ఆ దేశానికి తీసుకెళతానని మాట ఇచ్చాడు. అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించ వచ్చని హామీ ఇచ్చాడు. ఆమె చాలా ఆశగా ఎదురు చూసింది. కానీ పరిస్థితులు చాలా త్వరగా మారిపోయాయి. తన భర్తకు కెనడాలో మరో కుటుంబం ఉందని ప్రీతమ్‌ తెలుసుకుంది. దాంతో ఆమె లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా సహాయం కోసం వెళ్ళింది. అయితే తన భర్తకు వ్యతిరేకంగా ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఎఫ్‌ఐఆర్‌) దాఖలు చేయలేకపోయింది. ఎందుకంటే ఆమె వారి వివాహానికి సంబంధించిన డాక్యుమెంటేషన్‌ను అందించలేకపోయింది. అందుకే ఆమెకు న్యాయం జరగలేదు. ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా వంటి దేశాల్లో నివసిస్తున్న నాన్‌-రెసిడెంట్‌ భారతీయులను (ఎన్‌ఆర్‌ఐలను) వివాహం చేసుకుని మోసపోతున్న వేలాది మంది భారతీయ మహిళల్లో ప్రీతమ్‌ ఒకరు.
నివేదిక ప్రకారం
ది ఫుల్లర్‌ ప్రాజెక్ట్‌ నివేదిక ప్రకారం భారతదేశంలో 40,000 కంటే ఎక్కువ మంది మహిళలు నాన్‌-రెసిడెంట్‌ ఇండియన్స్‌ (ఎన్‌ఆర్‌ఐలను) పెండ్లి చేసుకుని మోసగించబడ్డారు. అబ్‌ నహీ వెల్ఫేర్‌ సొసైటీని నడుపుతున్న 41 ఏండ్ల లూథియానా నివాసి అయిన సత్వీందర్‌ కౌర్‌ వద్దకు సహాయం కోసం ప్రీతమ్‌ కౌర్‌ వంటి చాలా మంది మహిళలు వస్తుంటారు. వారికి న్యాయం జరిగేలా ఈ ఎన్‌జీఓ సహాయం చేస్తోంది.
అబ్‌ నహీ వెల్ఫేర్‌ సొసైటీ
”నేను నా జీవితంలో ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నాను. అలాంటి మహిళల బాధను నేను అర్థం చేసుకున్నాను. అబ్‌ నహీ వెల్ఫేర్‌ సొసైటీ ద్వారా ఈ మహిళలకు న్యాయం చేయడంలో సహాయం చేస్తూ, అలాంటి కేసుల సంఖ్యను తగ్గించాలనుకుంటున్నాను” అని ఆమె అంటున్నారు. సత్వీందర్‌ కౌర్‌్‌ లూథియానాలో స్కూల్‌ టీచర్‌గా పని చేసేటపుడు తన సహ ఉపాధ్యాయుడిని వివాహం చేసుకుంది. వివాహం అయిన కొన్నేండ్ల తర్వాత భర్త ఉక్రెయిన్‌కు వెళ్లి కొన్ని రోజుల తర్వాత ఆమెను కూడా తీసుకువెళతానని చెప్పాడు. అతని రాక కోసం ఎదురు చూస్తూ ఆమె తన తల్లిదండ్రులతో ఉండేది. ఐదేండ్ల తర్వాత అతను భారతదేశానికి తిరిగి వచ్చాడు. సత్వీందర్‌ గతాన్ని మరచిపోయి అతనితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె భర్తకు వేరే ప్లాన్‌లు ఉన్నాయి. అందుకే అతను సత్వీందర్‌ను అద్దె ఇంటికి మార్చాడు. త్వరలోనే ఇద్దరం విదేశాలకు వెళదాం అని చెప్పాడు. అయితే అతను ఆమె నుండి విడాకులు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
బరువెక్కిన హృదయంతో
న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఆమె అతని ప్రతిపాదనను వ్యతిరేకించింది. తాను ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించాలని ఆమె అడిగింది. కానీ అతను నిరాకరించాడు. ‘ఇకనుండి నీతో నాకు సంబంధం లేదు. ఇక నీ జీవితంలో నీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు’ అని ఆమెకు చెప్పాడు. సత్వీందర్‌ నిరుత్సాహానికి గురయింది. ‘మోసపోయానని తెలుసుకోవడానికి నా జీవితంలో చాలా ఏండ్లు వృధా చేసుకున్నాను’ అని ఆమె బరువెక్కిన హృదయంతో పంచుకుంది. అప్పటి నుండి ఎన్‌.ఆర్‌.ఐ భర్తలచే మోసపోయిన మహిళలకు చేయూతనిస్తూ, వారికి న్యాయం చేయడం తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే 2016లో అబ్‌ నహీ సంక్షేమ సంఘ స్థాపనకు దారితీసింది.
ప్రారంభ రోజుల్లో
కౌర్‌ అబ్‌ నహీ వెల్ఫేర్‌ సొసైటీ ప్రారంభించినప్పుడు ఆమెకు తగినంత మద్దతు లేదు. తర్వాత కాలంలో చాలా మంది మహిళలు సంస్థలో చేరారు. ప్రస్తుతం ఈ సంస్థ పంజాబ్‌, యుపి, గుజరాత్‌కు చెందిన 900 మందికి పైగా మహిళలకు సహాయం అందించింది. సంస్థ ఇప్పుడు ఇలాంటి కేసులను ఎదుర్కొంటున్న పురుషులకు కూడా తన సేవలను అందిస్తుంది. ఇప్పటివరకు సంస్థ 100 మంది పురుషులకు సహాయం చేసింది. బాధితురాలు సంస్థని సంప్రదించినప్పుడు వారి వివాహ సర్టిఫికేట్‌, అమ్మాయి గుర్తింపు కార్దు ద్వారా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోవడానికి వారు ఇరువైపుల వారికి కౌన్సెలింగ్‌ ఇస్తారు. బృందం వారి ఇంటికి కూడా వెళుతుంది. దాంతో ఈ మొత్తం ప్రక్రియకు ఒక నెల పడుతుంది.
చెప్పినంత సులభం కాదు
”కొన్నిసార్లు సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది. కొన్ని సమయాల్లో అత్యంత కష్టంగా ఉంటుంది’ అని ఆమె అంటున్నారు. పురుషులు విడిపోవడానికి గట్టిగా నిర్ణయించుకున్నపుడు ఆమె జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి బాధితులు విడాకులు, సెటిల్‌మెంట్‌ పొందడానికి సంస్థ వారికి సహాయం చేస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తిపై పోలీసు ఫిర్యాదు నమోదైన తర్వాత వారి పి.ఆర్‌లు రద్దు చేయబడటంతో పాటు వారి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకుంటారు. ‘కానీ ఫిర్యాదులు అంత సమర్ధవంతంగా దాఖలు కావు. కాబట్టి న్యాయం అనేది మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. పైగా చట్టపరమైన ప్రక్రియలకు చాలా సమయం పడుతుంది’ అని ఆమె అంటున్నారు.
సహాయం అందితే…
బాధిత కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్లయితే న్యాయపరమైన రుసుములను వారే చూసుకుంటారు. ఫీజులను భరించలేని పరిస్థితుల్లో ఉంటే ఎన్‌జీఓ తక్కువ రుసుముతో సహాయం లేదా చట్టపరమైన ప్రాతినిధ్యాన్ని పొందేందుకు న్యాయ నిపుణులతో సహకరిస్తుంది. ఇప్పటివరకు సత్వీందర్‌కి ఇది అంత తేలికైన ప్రయాణం కాదు. ఆర్థిక నిర్వహణ ఒక సవాలుగా కొనసాగుతోంది. ”నాకు ఒక బృందం ఉంది. కానీ వారికి చెల్లించడానికి నా దగ్గర డబ్బు లేదు. అందుకే మా లక్ష్యంతో సహవాసం చేయాలనుకునే వారు మాతో చేరతారు’ ఆమె చెప్పారు. ఏది ఏమైనప్పటికీ బాధితులకు అవసరమైన సహాయం చివరికి నెరవేరుతుందని సత్వీందర్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ”అన్యాయం, ద్రోహం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి కేసులు జరగకుండా ఆపడానికి నేను కృషి చేయాలనుకుంటున్నాను. త్వరలోనే మాకు కొంత సహాయం అందుతుందని నేను ఆశిస్తున్నాను. తద్వారా మేము మా పనిని నిర్విరామంగా కొనసాగించ గలము’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.
– సలీమ