ఎట్టకేలకు పాలమూరు-రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు

– రూ.106 కోట్ల జరిమానా ొ మరో రూ.153.7 కోట్ల
– నష్ట నివారణ చర్యలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎట్టకేలకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణులు కమిటీ అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జులై 24న 49వ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర అటవీ శాఖ అధికారులు, రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులతో జరిగిన ఉమ్మడి సమావేశంలో రాష్ట్ర అధికారులు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలతో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈసందర్భంగా ప్రాజెక్టు ఉద్దేశ్యం, లక్ష్యం, ఇతర వివరాలను అటవీశాఖ ఉన్నతాధికారులకు వివరించారు. అనుమతులు ఇవ్వకుండానే పనులు ప్రారంభించడం పట్ల కేంద్ర అధికారులు కొంత అసహనం వ్యక్తం చేసినప్పటికీ, నష్టనివారణ చర్యలతోపాటు భారీ జరిమానా విధించారు. పర్యావరణ పునరుద్ధరణ పనులను వచ్చే మూడేండ్లలో పూర్తిచేస్తామని చెప్పారు. అలాగే పర్యావరణ పునరుద్ధరణకు రూ.153.7 కోట్లు ఖర్చు చేసేందుకు రాష్ట్ర సాగునీటి శాఖ అంగీకరించింది. 2021-22 సంవత్సరంలో దాదాపు ప్రాజెక్టుకు రూ. 22 వేల కోట్ల పనులు చేసినట్టు రాష్ట్ర అధికారులు కేంద్ర అటవీశాఖకు తెలియజేశారు. ఈమేరకు అందులో నుంచి 0.5 శాతం కోట్ల జరిమానాను విధిస్తూ ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ పెనాల్టీ రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ)కి చెల్లించాలని ఆదేశించింది. ఈమేరకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని చెప్పింది. రాష్ట్ర సాగునీటి శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ హరిరామ్‌కు సైతం మార్గదర్శకాలు జారీ చేశారు. హరిరామ్‌ కాళేశ్వరంతోపాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అనుమతులకు సంబంధించి పనులు చూస్తున్నారు. నిజానికి 2015లోనే పాలమూరు-రంగారెడ్డి మొదటీ టీఓఆర్‌( టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌) ఇచ్చారు. ఆ గడువు ముగిసినా తర్వాత కూడా పర్యావరణ అనుమతులు రాలేదు. దీంతో రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన నిపుణుల కమిటీకి చెందిన తొమ్మిదో సమావేశం నుంచి ఇప్పటి దాకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. దీర్ఘకాలికంగా సాగుతున్న కృషిమూలంగా పర్యావరణ అనుమతులు వచ్చినట్టు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.
ఇది చారిత్రక విజయం.. : కేసీఆర్‌
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రక విజయమని అభివర్ణించారు. పథకం తొలిదశ పనులు తుదిదశకు చేరుకున్న తరుణంలో పర్యావరణ అనుమతులు మంజూరు కావటంపై ఆనందం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండవ దశ పనులు కూడా చకచకా ముందుకు సాగే అవకాశం ఏర్పడిందని తెలిపారు.ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, అనుమతుల సాధనలోనూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి సాటిలేదని నిరూపించుకుందని తెలిపారు. ఇది తెలంగాణ సర్కారు సంకల్పానికి మరో నిలువెత్తు నిదర్శమని సీఎం వివరించారు.
మొక్కవోని దీక్షకు ఫలితం : హరీష్‌రావు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయని ఆర్థిక మంత్రి టి. హరీష్‌రావు తెలిపారు. ఃకుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి.. దశాబ్దాలుగా అన్యాయనానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగు పరుగున రానుంది. ఈ అనుమతు లు సాధించడం సీఎం కేసీఆర్‌ సాధించిన మరో అపూర్వ, చారిత్మ్రాక విజయం. ఆయన మొక్కవోని దీక్షకు, ప్రభుత్వ పట్టువిడవని ప్రయత్నంతోడై సాధించిన ఫలితమిది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భం. మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టం. పాలమూరు బీళ్ల దాహార్తిని తీర్చే, ప్రజల తలరాతను మార్చే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుతులు రావడం అపూర్వ అనందాన్ని కలిగిస్తున్నదిః అని గురువారం ట్విట్‌ చేశారు.