– 125 మంది రోగుల తరలింపు
అహ్మదాబాద్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని ఒక ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. షాహిభాగ్ ప్రాంతంలో ఉదయం 4:30 గంటలకు 10 అంతస్తులతో ఉన్న రాజస్థాన్ ఆసుపత్రి భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంతో మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో ఆసుపత్రి నుంచి సుమారు 125 మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం గానీ, వ్యక్తులు గాయపడిన సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన ఉన్న ఒక నాలుగు చక్రాల వాహనం ధ్వంసమయిందని చెప్పారు. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఉదయం 8 గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను ఇంకా గుర్తించలేదు. ఒక చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి నిర్వహించబడుతుంది.