– సుమారు రూ.5లక్షల నష్టం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని మైలర్‌దేవ్‌పల్లిలో పేపర్ ప్లేట్ల తయారు చేసే కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ.ఐదు లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబుల్‌రెడ్డి నగర్ ప్రాంతంలో విశాల్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం ప్లాస్టిక్ పేపర్ తయారు చేసే కంపెనీని నెలకొల్పాడు. అయితే శనివారం మధ్యాహ్నం కార్మికులందరూ భోజనం చేయడానికి ఇంటికి వెళ్లగా.. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేపర్లు కావడంతో క్షణాల్లో మంటలు కంపెనీ మొత్తం వ్యాపించడంతో అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. దాంతో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు.. మూడు గంటల శ్రమించి మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కంపెనీలో ఉన్న కొంతమంది కార్మికులు మంటలు గమనించి బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.