– ఆహారభద్రత మెరుగుపర్చడంలో కీలకం
– ఎగుమతులను పెంచడానికి దోహదం: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘దేశంలోనే మొట్టమొదటిసారిగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)ని ప్రారంభించాం. ఇది అత్యాధునిక పరికరాలను కలిగి ఉంటుంది. కోల్డ్ చైన్ ఎకోసిస్టమ్ చుట్టూ ఉన్న అన్ని సవాళ్లను పరిష్కరించడానికి ఒక స్టాప్ పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా శీతలీకరణ సాంకేతికతలు, పరిష్కారాలను అభివద్ధి చేస్తుంది. ప్రపంచ స్థాయికి చేరువయ్యేలా చేస్తుంది. హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాల యానికి, క్యారియర్‌తో సహా ఈ చొరవకు మద్దతు ఇచ్చినందుకు పరిశ్రమ భాగస్వాములకు ధన్యవాదాలు’ అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సస్టైనబుల్ కూలింగ్ అండ్ కోల్డ్-చైన్ కోసం తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో సుస్థిర శీతలీకరణ ఆవిష్కరణలను ప్రోత్సహిం చడానికి, ఆహారం, వ్యాక్సిన్ సరఫరా గొలుసుల కోసం ఇంధన-సమర్థవంతమైన శీతలీకరణ విస్తరణను వేగవంతం చేయడానికి సీఓఈని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని జీఎంఆర్ ఇన్నోవేషన్స్ క్యాంపస్‌లో మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సొల్యూషన్స్ డెవలప్‌మెంట్ ల్యాబ్, డెమాన్‌స్ట్రేషన్ సెంటర్, మోడల్ ప్యాక్-హౌస్, కమ్యూనిటీ కూలింగ్ హబ్‌లు ఉంటాయన్నారు. ఇది తెలంగాణలోని రైతుల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిసున్నానని తెలిపారు. చాలా మంది రైతులు శీతల గిడ్డంగులు అందుబాటులో లేకపోవడంతో పాడైపోయే ఉత్పత్తులను అమ్ముకోలేకపోతున్నారని, రైతులు పాడైపోయే ఉత్పత్తులను సంరక్షించడం, వస్తువుల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడే పరిష్కారాలతో సీఓఈ ముందుకొస్తున్న దని చెప్పారు. ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌ను స్వీకరించడం ద్వారా, రైతులు, స్థానిక వ్యవసాయ వ్యాపారాలు, అగ్రి స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు, పరికరాల సాంకేతిక నిపుణులు, పరిశోధకులకు సీఓఈ నైపుణ్యం, శిక్షణా కార్యక్రమాలను అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రస్తుతం విలువైన ఫార్మా, వ్యాక్సిన్ ఎగుమతులను ఎగుమతి చేస్తోందన్నారు. ఇవి సమర్థవంతమైన కోల్డ్ చైన్ ఎకోసిస్టమ్‌పై ఆధారపడి ఉన్నాయని, వ్యాక్సిన్, ఫార్మా కోల్డ్ చైన్ కోసం కొత్త, స్థిరమైన సాంకేతికతలపై కేంద్రం దష్టి సారిస్తుందని, రాష్ట్రం నుంచి వ్యాక్సిన్ ఎగుమతుల మరింత వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఆహారం, ఆరోగ్య భద్రతను ప్రోత్సహించడం, రైతులను బలోపేతం చేయడం, ఎగుమతులను పెంచడం కోసం సస్టైనబుల్ కూలింగ్, కోల్డ్ చైన్ కోసం తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్(టీఎస్‌టీపీసీ), సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కూలింగ్(సీఎస్‌సీ), బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ), జీఎంఆర్ గ్రూప్‌ల మధ్య ఉమ్మడి చొరవ అని తెలిపారు.
2022లో తెలంగాణ ప్రభుత్వం, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఫలితమేనని అన్నారు. బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తుం దన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ ఓవెన్స్, సెంటర్ ఆఫ్ సస్టెయినబుల్ కూలింగ్(బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం) డైరెక్టర్ ప్రొఫెసర్ టోబిపీటర్స్, టీఎస్‌టీపీసీ చైర్మెన్ బిక్షపతి, పరిశ్రమ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, జీహెచ్‌ఐఏఎల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కిషోర్, సస్టైనబిలిటీ, క్యారియర్ గ్రూప్ డైరెక్టర్ జిమ్మీ వాషింగ్టన్, సీనియర్ అధికారులు పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.