మొదటి మహిళా చైర్‌పర్సన్‌

First woman chairperson1905లో స్థాపించబడిన రైల్వే బోర్డు(సిఆర్‌బి)కు ఈ 118 ఏండ్ల కాలంలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా చీఫ్‌గా నాయకత్వం వహించలేదు. అలాంటి నేపథ్యంలో బోర్డు చైర్‌పర్సన్‌గా, భారతీయ రైల్వే సిఇఒగా నియమితులైన తొలి మహిళగా జయ వర్మ సిన్హా చరిత్ర సృష్టించారు. ఈ అత్యున్నత స్థానానికి ఇటీవలె ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. భారతీయ రైల్వే నాయకత్వ స్థానంలో కొనసాగుతున్న లింగ వివక్షను బద్దలు కొట్టారు.
జయ వర్మ అలహాబాద్‌ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. 1988లో ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ (IRTS)తో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. వృత్తి పరంగా చూపిన నైపుణ్యం ఆమెను రైల్వే బోర్డ్‌లో, మంత్రిత్వ శాఖ కింద కార్యకలాపాలు, వ్యాపార అభివృద్ధిలో మెంబర్‌గా పని చేయడమే కాదు ఇప్పుడు ఏకంగా బోర్డుకు మొదటి మహిళా చైర్‌పర్సన్‌గా ఎదిగేందుకు దారితీసింది. విస్తారమైన భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో సరుకు రవాణా, ప్రయాణీకుల సేవల సమగ్ర రవాణాను పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా జయ వర్మ తన సభ్యు రాలు (ఆపరేషన్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌ మెంట్‌) పాత్రలో దాదాపు 300మంది ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన బాలాసోర్‌ ప్రమాదం తర్వాత సంక్లిష్ట మైన సిగలింగ్‌ సిస్టమ్‌పై దృష్టి పెట్టి ప్రజలను ఆకర్షించింది. ఆమె అధికారికంగా సెప్టెంబరు 1న తన కొత్త నాయకత్వాన్ని చేపట్టారు. ఆగస్టు 31, 2024 ఆమె పదవీ విరమణ వరకు ఆమె ఈ బాధ్యతల్లో ఉంటారు.
35 ఏండ్ల కెరీర్‌
భారతీయ రైల్వేలో 35 ఏండ్లకు పైగా ఆమెకు సుధీర్ఘ అనుభవం వుంది. ఆమె మెంబర్‌ (ఆపరేషన్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌) రైల్వే బోర్డ్‌, అడిషనల్‌ మెంబర్‌, ట్రాఫిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, రైల్వే బోర్డ్‌ వంటి వివిధ ముఖ్యమైన బాధ్యతల్లో పనిచేశారు. ఆమె కార్యకలాపాలు, వాణిజ్య, ఐటీ, విజిలెన్స్‌తో పాటు విభిన్న వర్టికల్స్‌పై పనిచేశారు. సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా నియమితులైన మొదటి మహిళ కూడా ఆమె. కోల్‌కతా నుండి ఢాకా వరకు ప్రసిద్ధ మైత్రి ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించబడిన సమయంలో ఆమె బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని భారత హైకమిషన్‌లో రైల్వే సలహాదారుగా పనిచేశారు.
గొప్ప ఆసక్తి
జయ 1988లో ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌లో చేరారు. ఉత్తర రైల్వే, ఎస్‌ఇ రైల్వే, తూర్పు రైల్వేలలో పనిచేశారు. ఆమెకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఆసక్తి ఉంది. ఆమె నియామకం ఆమె అసాధారణమైన సామర్థ్యాలను మాత్రమే కాకుండా భారతదేశ రైల్వేలలో నాయకత్వ పాత్ర లలో మహిళలను మరింత ముందుకు తీసురావడంలో సహాయం చేస్తుందని చెప్పుకోవచ్చు.