– 32 లైన్ల ద్వారా చేప మందు పంపిణీకి చర్యలు
– ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
చేప మందు ప్రసాదం కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ అందిస్తామని పశసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేప ప్రసాదం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదంపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. కరోనా కారణంగా మూడేండ్లపాటు పాటు చేప ప్రసాదం పంపిణీ చేయలేదని తెలిపారు.
తెలంగాణలోని వివిధ జిల్లాలతో పటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వచ్చారని, వారి సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించిందన్నారు. అవసరమైనన్ని చేపపిల్లలను మత్సశాఖ సరఫరా చేసినట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బి, విద్యుత్, జలమండలి, పోలీస్, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆర్టీసీ, ఫైర్ సర్వీస్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేస్తూ ఏర్పాట్లు చేశాయన్నారు. 5 తరాల నుంచి బత్తిన సోదరులు తయారు చేస్తున్న చేప ప్రసాదానికి చాలా గుర్తింపు ఉన్నదని చెప్పారు. శుక్ర, శనివారాల్లో చేప మందును అందించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచామని, అదనంగా మరో 75 వేల చేప పిల్లలతోపాటు.. అవసరమైతే మరిన్ని చేప పిల్లలను అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం 32 లైన్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తున్నామని, నాంపల్లి గ్రౌండ్ పరిసరాల్లో 700 వరకు సీసీ కెమెరాలు, దాదాపు 300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రయాణికుల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని వివరించారు. స్వచ్ఛంద సంస్థలు సేవలు అందించినట్టు మంత్రి తెలిపారు. అగర్వాల్ సేవ సమితి, పంజాబీ సేవ సమితి, జైస్వాల్ సేవ సమితి వారు ఉచితంగా ఏర్పాటు చేసిన అన్నదానం కౌంటర్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.