– నీటి సంబంధిత వ్యాధులు నివారించండి
– మున్సిపల్ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వర్షాలు తగ్గుముఖం పడుతున్నందున పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. కలుషిత నీరు, నీటి సంబంధ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. శనివారంనాడాయన పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వారికి ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలని సూచించారు. వరద సహాయ చర్యల్ని సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో పనిచేయాలని కోరారు. దీనికోసం అవసరమైన సంపూర్ణ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. ఇప్పటికే అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పట్టణాల్లో చెరువులు పూర్తిగా నిండాయనీ, వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అవసరాలను బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని సూచించారు. సహాయ కార్యక్రమాల సమన్వయం కోసం హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించి, తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలన్నారు. బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్, దోమల నివారణ మందుల పిచికారి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు డీ-వాటరింగ్ పంపులను వినియోగించాలని చెప్పారు. ప్రజలు తాగునీటిని కాచి వడపోసుకొని వినియోగించాలనే అవగాహనా కార్యక్రమలు చేపట్టాలన్నారు. సురక్షిత తాగునీరు సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని, పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు చేస్తూ, తాగునీటి క్లోరినేషన్‌ను చేపట్టాలని ఆదేశించారు. పట్టణాల్లోని బస్తీ దవాఖానాల్లో వైద్యారోగ్యశాఖ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థల సహకారంతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పారు. శిధిలావస్థలో ఉన్న పురాతన భవనాలను తొలగించాలనీ, విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.