భగీరథ కార్మికులకు

– బకాయి వేతనాలు చెల్లించాలి
– మిషన్‌ భగీరథ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ)
నవతెలంగాణ-సంగారెడ్డి
మిషన్‌ భగీరథ కార్మికులకు 5 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మిషన్‌ భగీరథ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఎస్‌ఈ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్మికులు అధిక సంఖ్యలో హాజరై తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ స్కీంలో పనిచేస్తున్న పంపు ఆపరేటర్స్‌, లైన్‌మెన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రిషన్‌, స్వీపర్‌, ల్యాబ్‌ కార్మికులకు 5 నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో.. వారి కుటుంబాలు గడవడం కష్టంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, వారికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌లు, వారాంతపు సెలవులు, రక్షణ పరికరాలు తదితర సౌకర్యాలు అమలు కావడం లేదన్నారు. జిల్లాలో మిషన్‌ భగీరథ స్కీంను ప్రభుత్వం నిర్వహించకుండా కేఎల్‌ఎస్‌ఆర్‌, జీవీఆర్‌, ఎవరెస్ట్‌, రాఘవ, ప్రీమియర్‌, మెగా ఎల్‌ఎన్‌టి తదితర కాంట్రాక్టర్లకు అప్పగించడంతో ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకమైన వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. నెలకు రూ.7500 నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నెలకు రూ.18000 చెల్లిస్తే.. కార్మికులకు మాత్రం ఇలా అరకొర వేతనమివ్వడం సరికాదన్నారు. ఇంటింటికి నీటిని సరఫరా చేస్తూ దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని సీఎం చెబుతున్నప్పటికీ.. అందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న కార్మికులను మాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. భగీరథ కార్మికులతో 8 గంటల పనిని 12 గంటలు చేయించుకుంటూ అదనపు పనికి అదనపు వేతనం కూడా చెల్లించడం లేదన్నారు. వేతనం, సౌకర్యాల గురించి అడిగిన కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించడం, వేధింపులకు గురి చేయడం లాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.26,000 కనీస వేతనం ఇవ్వాలని, అప్పటివరకు ప్రభుత్వం కాంట్రాక్టులకు ఇస్తున్న రూ.18,000 అయినా చెల్లించాలని కోరారు. చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయని కాంట్రాక్టుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ముట్టడి అనంతరం మిషన్‌ భగీరథ ఈఈ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.యాదగిరి యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్‌, సిహెచ్‌. రాములు, కార్మికులు కృష్ణ, కే.రాములు, ప్రభాకర్‌, శ్రీనివాస్‌, నర్సింలు, సిద్ధప్ప, వీరారెడ్డి, లింగం, సుదర్శన్‌, వెంకట ేష్‌, బిచ్చప్ప, అజరు, సదానందం తదితరులు పాల్గొన్నారు.